తానా - పాఠశాల ఆధ్వర్యంలో ‘ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై’
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:19 PM
తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఈసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో 100 మంది విద్యార్థులతో 8 గంటల పాటు నిర్విరామంగా ప్రత్యేక సాహిత్య కార్యక్రమం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వ్యాప్తంగా వందలాది మంది ప్రవాస భారతీయుల చిన్నారులకు తెలుగు నేర్పించే సమున్నత వేదిక ‘పాఠశాల’. తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఈసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో మార్చి 22న 100 మంది విద్యార్థులతో 8 గంటల పాటు నిర్విరామంగా ప్రత్యేక సాహిత్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు పద్యం, పాట, కథ విభాగాల్లో తమ ప్రతిభను చూపించారు. ‘మన యువతే మన వారసత్వం’గా భావిస్తూ స్వర్ణోత్సవాలకు అడుగు దూరంలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తానా మాజీ అధ్యక్షులు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్, తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, కోశాధికారి రాజా కసుకుర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తెలుగింటి పండుగ ఉగాదిని పురస్కరించుకొని తెలుగు వెలుగే సజీవ పునాదిగా సాగుతున్న ‘పాఠశాల’ వేదికను ఈ సందర్భంగా వందలాది మంది తల్లిదండ్రులు అభినందించారు. తేనెలొలుకు తెలుగును, రేపటి తరం కోసం సజీవ ఆస్తిగా నిలుపుకుందామని, సగౌరవ అస్తిత్వంగా చాటుకుందామని ఉపాధ్యాయులు, నిర్వాహకులు ప్రసాద్ మంగిన, అమృత ముత్యాల, శ్రీ రంజని శేట్టులూరి, రంజిత ఆదిమూలం, శేఖర్ చంద్ర పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ తెలుగును భవిష్యత్ తరాలకు శాశ్వత ఆస్తిగా అందించే స్ఫూర్తిని నిలబెట్టుకుంటామని పాఠశాల అధ్యక్షులు భాను మాగులూరి తెలిపారు.
ఈ వార్తలూ చదవండి:
శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’ కార్యక్రమం
ఒమాన్‌లో శ్రీ రాజ రాజేశ్వరస్వామి కల్యాణోత్సవం