ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదన.. హెచ్-4 వీసాదారులకూ షాక్ తప్పదా?
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:14 PM
అమెరికాలో ఉపాధి పొందుతున్న విదేశీయులకు షాకిచ్చే మరో ప్రతిపాదనను ట్రంప్ సర్కారు సిద్ధం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉపాధి పొందుతున్న విదేశీయులకు షాకిచ్చే మరో ప్రతిపాదనను ట్రంప్ సర్కారు సిద్ధం చేసింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగానుమతిని నిలిపివేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాములు హెచ్-4 వీసా సాయంతో అమెరికాకు వెళతారన్న విషయం తెలిసిందే. ఆ తరువాత అక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఆథొరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) సాయంతో ఉపాధి పొందుతారు.
అయితే, హెచ్-4 వీసాదారులకు అమెరికాలో ఉపాధికి అర్హత లేకుండా చేసే ప్రతిపాదన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తెరపైకి తెచ్చింది. ఉపాధి పొందేందుకు అర్హత ఉన్న విదేశీయుల జాబితా నుంచి హెచ్-4వీసాదారులను తొలగించాలన్నది ఈ ప్రతిపాదన సారాంశం. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ అంశాన్ని ప్రజల ముందుకు ఎప్పుడు తెస్తారనే విషయంలో ఎలాంటి టైమ్ టేబుల్ ప్రభుత్వం నిర్ణయించలేదు.
2017లోనే ట్రంప్ సర్కారు హెచ్-4 వీసాదారులపై ఆంక్షలకు ప్రయత్నించింది. హెచ్-4 వీసాదారులకు అమెరికాలో జాబ్స్‌కు అర్హత లేకుండా చేద్దామనుకుంది. కానీ వివిధ కారణాలతో 2021లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
ప్రస్తుతం హెచ్-4 వీసాదారులు ఎప్పటివలెనే ఈఏడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మాత్రం అక్కడి భారతీయ కుటుంబాలపై అధిక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. హెచ్-1బీ వీసాదారుల్లో 71 శాతం మంది భారతీయులన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈలో స్కామ్.. భారతీయులకు ఎంబసీ అలర్ట్
పరాయిగడ్డపై ప్రవాసీయుల ఆప్యాయతను దారాలుగా పెనవేసిన రాఖీ