పరాయిగడ్డపై ప్రవాసీయుల ఆప్యాయతను దారాలుగా పెనవేసిన రాఖీ
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:42 PM
గల్ఫ్ దేశాల్లో ఎన్నారైలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఎల్లలు దాటి ఎడారి దేశాలకు వెళ్లినా కేవలం మాతృభాష ఆధారంగా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనురాగ ఆప్యాయతలను దారాలుగా పెనవేసి తెలుగు ప్రవాసీయులు ఇటీవల రాఖీ పండుగను జరుపుకున్నారు.
మానవత్వం కనుమరుగవుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో అందునా దేశం కానీ దేశంలో విశిష్టమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే రాఖీ ఔన్నత్యాన్ని అరబ్బునేలపై తెలుగు ఆడబిడ్డలు చాటారు. ఒకప్పుడు తెలుగునాట నుండి పోస్టు ద్వారా తమ అన్నదమ్ములకు రాఖీలు పంపించడానికి పోస్టాఫీసులలో క్యూలు కట్టేవారు. ప్రస్తుతం స్థానికంగానే రాఖీలు లభ్యమవుతున్నాయి. ఇదంతా ఒకెత్తైతే తోబుట్టువులతో పాటు తమ సోదర సమానులుగా భావించే వారితో మానవ సంబంధాలను మరింత పట్టిష్టం చేస్తూ సోదర ప్రేమకు ప్రతిరూపంగా రాఖీలు కడుతున్నారు.

రెండు దశాబ్దాలకు పైగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో స్థిరపడ్డ హైదరాబాద్‌కు చెందిన ప్రియా సింగారెడ్డి తన పెళ్లికి ముందు హైదరాబాద్‌లో తన సోదరుడికి రాఖీ కట్టేది. ఆ తర్వాత సోదరుడు దుబాయికి రావడంతో ఆమె ప్రవాసంలో కూడా రక్షాబంధన్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కానీ దుబాయిలోని అనేక మంది తెలంగాణ వారిని కూడా సోదరసమానులుగా భావించి వారికి కూడా రాఖీ కట్టి తోబుట్టువుల మధ్య ఆప్యాయతను చూపించారు.

ప్రతి రాఖీ పండుగ సందర్భంగా సుమారు 200 మంది సోదరులకు తాను రాఖీ కడుతుంటానని, ఈసారి కూడా అదే సంఖ్యలో కట్టానని ప్రియా సింగారెడ్డి పేర్కొన్నారు. దుబాయి, అబుదాబి నగరాలలోని అనేక మంది తనను సొంత అక్కగా ఆదరిస్తారని చెప్పారు. రాఖీ కట్టే సమయంలో వారి కళ్లల్లో వ్యక్తమయ్యే సంతోషాన్ని వర్ణించలేనని ఆమె అన్నారు.
కుల మతాలకు అతీతంగా సోదరులుగా భావించి చేతికి రాఖీని కట్టే ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తున్న రక్షా బంధన్ సంప్రదాయాన్ని ఇతరులకు కూడా తెలియజేసే ఉద్దేశ్యంతో తాము తమకు తెలిసిన వారికి రాఖీ కడుతున్నట్లుగా సౌదీ అరేబియాలోని రియాధ్‌లో నివసించే నల్గొండ జిల్లాకు చెందిన లోకే సుధా అన్నారు. సొంత అన్నదమ్ముల్లే కాదు ఆప్యాయతతో సోదరిగా భావించే వారందరూ కూడా అన్నదమ్ములేనని చిత్తూరు జిల్లాకు చెందిన సింధూ వ్యాఖ్యానించారు.

ఖతర్‌లోని భారతీయ ఎంబసీ ఆవరణలో జరిగిన రక్షా బంధన్ కార్యక్రమంలో తెలుగు సోదరీమణులు కూడా పాల్గొని రాఖీలు కట్టారు. గతంతో పోల్చితే ఈసారి వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే రాఖీ కార్యక్రమాలు తగ్గాయి. హైదరాబాద్‌లో ఉంటున్న తన ఇద్దరు అన్నదమ్ములకు రాఖీని ఆన్‌లైన్ ద్వారా పంపగా అన్నకు సకాలంలో అందలేదని, తమ్ముడికి అందిందని ఖతర్‌లో నివాసముండే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మిథిలా రెడ్డి అన్నారు.
తన సొంత తమ్ముడితో పాటు వరుసక అన్నదమ్ములైన వారు హైదరాబాద్‌లో శుభకార్యక్రమాలకు వచ్చినా రాకున్నా రాఖీ పండుగకు మాత్రం తప్పకుండా వస్తారని చెప్పారు. అయితే ఈసారి తాను రాఖీ పండుగలో పాల్గొన లేకపోయానని హైదరాబాద్ నగరానికి చెందిన మరో ప్రవాసీ ప్రముఖురాలు నందిని గౌడ్ అన్నారు. ఖతర్‌లో కూడా తనకు పెద్ద సంఖ్యలో సోదరసమానులు ఉన్నారని నందిని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
వచ్చే నెలలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం
శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ 5కే వాక్ విజయవంతం