గల్ఫ్‌లో దర్జగా దర్జీలు.. రాణిస్తున్న తెలుగువారు
ABN , Publish Date - Apr 17 , 2026 | 07:21 AM
గల్ఫ్‌లో దర్జీలుగా తెలుగువారు రాణిస్తున్నారు. అరబ్బు దుస్తులను కుట్టడంలో సృజనాత్మకను ప్రదర్శిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: అధునికత ఎంతగా విస్తరిస్తున్నా వృత్తి నైపుణ్యతకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఆకర్షణీయమైన డిజైన్లతో రెడీమేడ్ దుస్తులతో మార్కేట్లు నిండిపోతున్నా దుస్తులు కుట్టే దర్జీలకు ప్రాధాన్యత అదే విధంగా కొనసాగుతుంది.
వివాహాది శుభకార్యాలు మొదలు మాములు లుంగీల కత్తరింపు వరకూ ఎంత కాదన్నా టైలర్ అవసరమే. అందుకు భారతదేశం లేదా పరాయి దేశం ఏ మాత్రం మినహాయింపు కాదు. సృజనాత్మక నైపుణ్యాలు, అభిరుచి కల్గిన ఔత్సాహికులు అనేక మంది టైలరింగ్ వృత్తిలో రాణిస్తున్నారు. సంప్రదాయక దుస్తులు ధరించే సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలలో అయితే భారతీయ టైలర్లు అందునా తెలుగు టైలర్లు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకోన్నారు. పురుషుల తోబుల మొదలు మహిళల అలంకరణ దుస్తుల వరకూ తమదైన కళా నైపుణ్యంతో కుట్టే టైలర్లు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు.
మాతృదేశంలో జుకీ కుట్టు మిషన్లతో సగటు దర్జీకి గండిపడినా సౌదీ అరేబియాలో మాత్రం తెలుగు టైలర్లు రాణిస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్‌లోని ఉత్తరప్రదేశ్ టైలర్లకు దీటుగా తెలుగు టైలర్లు తమ కుట్టు నైపుణ్యంతో అరబ్బులను ఆకట్టుకుంటున్నారు.
కొన్ని చిన్నపాటి పట్టణాలలో వీరు సమూహాలుగా వర్ధిల్లుతున్నారు. తెలుగునాట ఒక్కొక్క దర్జీ తన వెంట అనేక మందిని తీసుకువస్తున్నారు. అల్ హసా, అభా, బురేదాలలో ఒక్కొక్కరూ ఏకంగా ఇరువైఐదు మంది వరకూ తమ తమ బంధుమిత్రులను తీసుకువచ్చారు. హాయిల్ అనే పట్టణంలో ఒకప్పుడు 200 మంది తెలుగు టైలర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 20 వరకు పడిపోయింది.
హాయిల్‌లో ముప్ఫయి సంవత్సరాలు పైగా నివసిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామానికి చెందిన చల్లబోయిన సుబ్రమణ్యం తమ ప్రాంతానికి చెందిన అనేక మంది టైలర్లను తీసుకోవచ్చి అరబ్బుల దుస్తుల కుట్టడంలో మెళకువలు నెర్పించారు. ఆయన నేతృత్వంలో ప్రస్తుతం ఆరుగురు ఆంధ్రులు టైలర్లుగా అరబ్బులకు తోబులు కుడుతున్నారు. రెడీమేడ్ దుస్తుల వినియోగం పెరిగినా తమ డిమాండ్ తగ్గలేదని సుబ్రమణ్యం చెప్పారు.
స్వగ్రామంలో ఉషా మెషిన్‌పై కాళ్ళు అరిగేలా బట్టలు కుట్టడం ద్వారా వృత్తిని ప్రారంభించిన సుబ్రమణ్యం ప్రస్తుతం మాస్టార్‌గా కేవలం కటింగు మాత్రమే చేస్తుండగా కుట్టే పనిని అత్యాధునిక జుకీ మెషిన్లపై అతని బృందం చేస్తోంది.
తన దుకాణం నిర్వాహణలో సామగ్రి కోసం రియాధ్ నగరానికి తరచుగా వెళ్తుంటారు. సౌదీ అరేబియాలో వివిధ తెలుగు ప్రవాసీయులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్న సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశన్ తోడ్పాటుతో సుబ్రహ్మణ్యం ఇటీవల తెలుగు టైలరింగ్ అసోసియేషన్‌ను కూడ ఏర్పాటు చేశారు. తమకు సహాయసహకారాలు అందించినందుకు మల్లేశన్‌ను ఆయన అభినందించారు.
ఇతర టైలర్లు కట్టా రమణ (వెదుర్లంక), అంజిబాబు (దొడ్డిపట్ల), విత్తనాల నరేశ్, బొంతు సాయిబాబ తదితరులు కూడా ఇందులో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
దుబాయిలో దద్దరిల్లిన తెలుగు దళిత మహిళా శక్తి
గల్ఫ్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు