దుబాయిలో దద్దరిల్లిన తెలుగు దళిత మహిళా శక్తి
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:05 PM
యు.ఎ.ఇ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలుగు దళితులు తమ శక్తిని ప్రదర్శించగా అందులో మహిళలు తమ విశిష్టతను చాటారు.
ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో తెలుగు దళిత మహిళా శక్తి దద్దరిల్లింది. దళిత మహిళ తన సామాజిక,ఆర్థిక, రాజకీయ అసమానతలను అధిగమిస్తూ పురోగమిస్తున్న తీరు అక్కడ జరిగిన బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ప్రతిబింబించింది.
యు.ఎ.ఇ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలుగు దళితులు తమ శక్తిని ప్రదర్శించగా అందులో మహిళలు తమ విశిష్టతను చాటారు. యుద్ధ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కూడా పెద్ద సంఖ్యలో పేద మహిళలు గుమిగూడి జై భీం అని నినదించారు. ఈ మహిళలలో అత్యధికులు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ పొట్టపోసుకునే వారైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు చేతనైన విధంగా విరాళాలిచ్చారు. పండుగకు వచ్చినట్లుగా ఉత్సాహంగా పట్టు చీరలు ధరించి వచ్చి దళిత మహాపురుషుడ్ని స్మరించుకున్నారు. నగరం నడిబొడ్డున కరమా మొదలు అజ్మాన్ వరకూ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలతో పండుగ వాతావరణం నెలకొంది.

ఎల్లలు దాటిన అనంతరం ఆర్థిక స్వావలంబన సాధించినా స్వదేశంలో ఇంకా రాజకీయ, సామాజిక న్యాయం సాధించవల్సిన ఆవశ్యకత ఉందని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవా సమితి అధ్యక్షుడు తరపట్ల మోహన్ అన్నారు. తాము ఆశించిన దాని కంటే ఎక్కువగా దళితులు సభలో పాల్గొన్నారని ఆయన అన్నారు.
పీడిత జనాలకు దిక్సూచి బాబా సాహెబ్ సూత్రాలు సర్వకాలాలకూ వర్తిస్తాయని పాస్టర్ పాలపర్త సురేశ్ అన్నారు. దళిత ప్రముఖులు నేలపాటి ఇస్సాక్, బండి ఐజాక్, బుంగా డేవిడ్, రామరాజు, జోసెఫ్ అంబేద్కర్, కాగిత కుమార్, కుసుమో ప్రభుదాస్, గోగి శరత్, పెదపాటి ప్రేమనంద్, యాండ్ర వెంకట్, మెదిడ శ్యాం, ఓగురి శ్రీను, గెడ్డెం నరేశ్, నమ్మితి రవి, పీటర్, యాండ్రా శ్రీను, మోకా అనిల్, పాము సత్యనారాయణ, బొక్కా శ్రీను, గెడ్డం బాలరాజు, మురలా ఆనంద, శేఖర్ తదితరులు కూడా మాట్లాడారు.
తరతరాలుగా అణచివేయబడ్డ తాము సమాన స్థాయికి ఎదగడానికి యుగాలు పడుతాయని మహిళ నాయకురాలు సాంబర్ మణి అన్నారు. పొట్టకూటి కోసం ఎడారికి వచ్చినప్పటికీ సామాజికంగా తాము ఇంకా గోదావరి జిల్లాలోనే ఉన్నట్లుందని పశ్చిమ గోదావరి జిల్లా అచంటకు చెందిన గోసంగి ధనలక్ష్మి వ్యాఖ్యానించారు. హెప్సిబా, సరిల్లా విజయ, చికిలే కుమారి, హాసినా, మారుమూడి సుధా, విజయ తదితరులు మహిళలను సమన్వయం చేశారు.




