గల్ఫ్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 07:46 PM
గల్ఫ్‌లోని తెలుగు యువకులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: పేదరికంతో అంతంత మాత్రం చదువులతో పొట్టకూటి కోసం చిన్నపాటి ఉద్యోగాలు చేసే వారందరు కూడా తెలుగు నవ యువకులు. చేసేది చిన్న ఉద్యోగాలైనా కూడా ఉన్నత ఆశయాలతో సమసమాజ స్థాపన కోసం తమవంతుగా అహర్నిశలూ కృషి చేస్తూ ముందుకెళ్తున్న ఈ ప్రవాసీ తెలుగు దళిత యువకులు గల్ఫ్ దేశాలలోని తెలుగు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటే ప్రయత్నం చేస్తున్నారు.
దుబాయిలో డప్పు వాయించడం ద్వారా తన కులవృత్తిని సగర్వంగా చెప్పుకునే నల్లా నర్సయ్య మొదలు ఖతర్‌లో పేద రోగులకు మందులు సమకూర్చడంలో సహాయమందించే బాబు సికోలు, కువైత్‌లో డబ్బులు లేని వారికి ఎంబసీ వరకూ కారులో ఉచితంగా తీసుకెళ్లే మారె శేఖర్ వరకూ ప్రతి ఒక్క దళిత ముద్దుబిడ్డ తమ అస్తిత్వాన్ని ప్రదర్శించడానికి గల్ఫ్ దేశాలలో చేస్తున్న ప్రయత్నాలు ఈసారి అట్టహాసంగా నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రతిబింబిస్తున్నాయి. దళిత పేద చిట్టి చేతులన్నీ కలిసి అన్నదానం నుండి రక్తదానం వరకూ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దళిత సామాజిక సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీక అయిన డప్పు దరువులు మారుమోగుతున్నాయి.

ఖతర్ రాజధాని దోహాలో సోమవారం రాత్రి జై భీం యూత్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో సంప్రదాయక దళిత డప్పు వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్ తుమమాలో స్థల వేదిక సరిపడకపోవడంతో సభికులు హాలు బయట నిలుచోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు సికోలు, సురేశ్ వాసర్ల, బళ్ళా రాజ్ కుమార్, తాడి మోహన్‌ల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దళిత యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐసిబియఫ్ అధ్యక్షుడు షానవాస్ టి. బావ, సలహాదారుడు కె.యస్. ప్రసాద్, డాక్టర్ సత్యా రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఖతర్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్, ప్రముఖ మహిళ నాయకురాలు, ఐ.డబ్ల్యు.డబ్ల్యు.ఓ అధ్యక్షురాలు రజనీ మూర్తి, ప్రవాసీ ప్రముఖులు శంకర్ గౌడ్, రాజ్ కుమార్ బళ్ళా, మధుసూధన్ రెడ్డి, డాక్టర్ నర్సింహారెడ్డి, మనిష్ అరుణ్ తదితరులు మాట్లాడుతూ జై భీం యూత్ నిబద్ధతను ప్రశంసిస్తూ అందరం ఎల్లకాలం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.

ఖతర్‌లో పని చేసే పేద తెలుగు ప్రవాసీయులలో అత్యధికులు బడుగు దళిత వర్గాలకు చెందిన వారున్నారని జై భీం యూత్ అధ్యక్షుడు బాబు సికోలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖతర్‌లోని సభికులను ఉద్దేశించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు రాపాక వరప్రసాద్, ఎడ్ల తాతాజీ, పాముల రాజశ్వేరి దేవిలు మాట్లాడారు.
కువైత్‌లో సాముహిక సమావేశాలపై ఆంక్షలు ఉండడంతో స్థానిక నియమాలకు లోబడి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం నుంచి శుక్రవారం వరకూ వివిధ దళిత సంఘాలు విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మారె శేఖర్ ఆధ్వర్యంలో రక్తదానం, మట్టా జాషువ వాసు ఆధ్వర్యంలో జయంతి ఉత్సవ సభ జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. సంఘాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా కొందరు మిత్రులు కలిసి జయంతి ఉత్సవాలను జరుపుకోన్నారు. ఇటీల అరేబియా సముద్ర తీరంలో కొందరు కోనసీమ జిల్లాకు చెందిన ప్రవాసీయులు జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. మహనీయుడు అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి ఒక కులం, మతం లేదా సంఘం అవసరం లేదని, మానవీయ సమానతను కోరుకునే ప్రతి భారతీయుడు జరుపుకోవచ్చని కువైత్‌లోని దళిత ప్రముఖుడు అనిల్ వ్యాఖ్యానించారు.

దుబాయిలో ఈసారి భారీ ఎత్తున జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వివిధ చోట్ల సంబరాలను జరుపుకోగా మంగళవారం రాత్రి బి.ఆర్.అంబేద్కర్ యు.ఏ.ఇ సేవా సమితి ఆధ్వర్యంలో సభ జరపడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులలో ఒకరై ప్రభుదాస్ తెలిపారు. అంతకు ముందుగా వేరుగా గ్రాండ్ ఎక్సల్సియర్ హోటల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దళిత ప్రముఖులు యేసు మణి, మేరి, యేహన్, రాములు, వినోద్, రవిలు మాట్లాడుతూ దళిత ఐక్యత గురించి నొక్కి చెప్పారు.