రియాధ్‌లో టాసా సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 07:29 PM
రియాధ్‌లో తెలుగు ప్రవాసీయుల సంఘం టాసా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక ప్రవాసీ కుటుంబాలు పాల్గొన్నాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు వారికి సౌదీ అరేబియా ఎడారి అయినా సఖినేటిపల్లి లేదా సత్తుపల్లి అయినా తేడా ఏమీ ఉండదు! పండుగ సంబరాల్లో తెలుగు ప్రజానీకం మునిగి తేలుతుంది. కొందరు ఔత్సాహికులు మాతృభూమికి వెళ్ళి కోడి పందేలు చూసి ఆనందిస్తే అత్యధికులు ఇక్కడి ఎడారి దేశాలలో తమకు వీలైన విధంగా సాంప్రదాయ పద్ధతుల్లో సంబరాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని వివిధ నగరాలలో తెలుగు ప్రవాసీయులు సంక్రాంతి సంబరాలను నిర్వహించగా ఇటీవల రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన టాసా(తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరం అంబరాన్నంటింది.
ఇటీవల టాసా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు పాల్గొన్నాయి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తాము 2019 నుండి రియాధ్ నగరంలో సంక్రాంతి, ఇతర తెలుగు పండుగలను, సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటున్నామని టాసా అధ్యక్షుడు స్వర్ణ స్వామి తిరుపతి తెలిపారు.

అతిథుల అభిరుచి, వయస్సులకు తగినట్టుగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక, వినోదభరిత కార్యక్రమాలతో పాటు ఉత్కంఠభరితంగా సాగిన క్రీడా పోటీలు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. సభాస్థలి వద్ద అప్పటికప్పుడు చేసిన బూరెలు, గారెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు ముచ్చటగా పాల్గొన్న సంప్రదాయ ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు అలరించాయి. ఆకర్షణీయమైన ముగ్గుల పోటీలను సంధ్య గుగ్గిలం, శ్రీదేవి వాకాటి, విద్య గురజాల, కోకిల, నాగమణి, సింధు పోకూరి, స్రవంతిలు నిర్వహించారు. చిన్నారుల క్రీడా పోటీలను సంధ్య గుగ్గిలం, విద్య గురజాల, భాస్కర్ గంధవల్లి, మహేష్ ఉదయాన సమన్వయం చేశారు. ఈసారి మహిళలకు కూడా ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహించగా అందులో బ్యాడ్మింటన్‌లో బిందు భాస్కర్ ప్రథమ స్థానాన్ని, సంధ్య ద్వితీయ, సాయికేదార్ తృతీయ స్థానాలను సాధించారు.

దినసరి యాంత్రిక జీవనంతో అలసిపోయే ప్రవాసీయులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలకు ముందుగా టాసా సంఘం క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. ఈసారి జరిగిన పోటీలలో రియాధ్ రాంపేజ్ రాయల్స్ జట్టు విజేతగా నిలవగా, ఛాలెంజర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఛాలెంజర్స్ – నటరాజ్ కుమార్, కోరుట్ల CC – ముజమ్మిలుద్దీన్ ఖాజా, కోరుట్లవీసీ CC – హైదర్ మోహిద్దున్, రియాద్ రాంపేజ్ రాయల్స్ – శివ కృష్ణ, TRT వారియర్స్ – జాహిద్, తెలుగు టైటాన్స్ ఫైటర్స్ – వెంకట్, తెలుగు టైటన్స్ రైడర్స్ – ఇబ్రహీంలు తలపడ్డారు.
చిన్నారుల కోసం నిర్వహించిన పోటీలలో కిడ్స్, సీనియర్స్ విభాగంలో ప్రజ్వల్, జతిన్, గౌతమ్ కిడ్స్ జూనియర్స్ విభాగంలో భవిష్య, రిత్విక్, బ్రిందాలు విజయం పొందారు.

రియాద్ TASA అధ్యక్షుడు తిరుపతిస్వామి స్వర్ణ, తాటికాయల మురారి, మహేంద్ర వాకాటి, ఇతర ముఖ్య సభ్యులు అనిల్ మర్రి, ఇబ్రహీం షేక్, నటరాజ్, అజయ్ రావూరి, సాయి, శివ, భాస్కర్‌లు ఈ వేడుకలను అన్నీ తామై నిర్వహించారు.
తెలుగు ప్రవాసీ ప్రముఖులు సాటా మల్లేశం, నూరోద్దీన్, సురేశ్, కోకిల, శ్రీనివాస్, తేజలతో పాటు ప్రవాసీ ప్రముఖులు దేవదాస్ కనకాల, జమాల్, గులాం ఖాన్‌లు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
కువైత్‌లో మరణించిన మహిళల ఆభరణాలు అదృశ్యం కావడంతో కలకలం.. ఈ ఉదంతంపై చర్చకు తెర
గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్ వర్ధంతి.. టీడీపీ కార్యకర్తల ఘన నివాళులు