NRI: కువైత్‌లో మరణించిన మహిళల ఆభరణాలు అదృశ్యం కావడంతో కలకలం.. ఈ ఉదంతంపై చర్చకు తెర
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:43 PM
కువైత్‌లో మృతి చెందిన తెలుగు మహిళల ఆభరణాల కాంట్రవర్సీ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చిన తెలుగు ప్రముఖుడు తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో మరణించిన ఇద్దరు ప్రవాసాంధ్ర మహిళల బంగారం, వెండి ఆభరణాలు అదృశ్యం కావడం గల్ఫ్‌లో చర్చనీయాంశంగా మారింది. కువైత్‌లో మరణించిన ప్రవాసుల మృతదేహాలను స్వదేశానికి పంపించడంలో సహాయమందించే ఒక తెలుగు ప్రముఖుడి పేరు కూడా ఈ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చింది. ఈ ప్రచారపర్వం బుధవారం సాయంత్రం మరో మలుపు తిరిగింది.
మృతదేహాల తరలింపు, జైళ్ల నుండి స్వదేశానికి తిరిగి వెళ్ళే ప్రవాసీయులకు సహాయమందించే వ్యవహారాల్లో కడప జిల్లాకు చెందిన ఓ ప్రవాసీ ప్రముఖుడు ముందుంటారు. అయితే, డిసెంబర్ చివరి వారంలో కువైత్‌లో మరణించిన ఇద్దరు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మహిళల మృతదేహాలపై ఉన్న ఆభరణాలను ఆయన స్వాహా చేశాడనే ఆరోపణలు సామాజిక మాధ్యమాలలో దుమారం రేపాయి. ఆ సమయంలో ఆయన స్వదేశానికి తిరిగి వెళ్ళడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంచడంతో ఇది మరింత ఆసక్తిదాయకమైన చర్చనీయాంశంగా మారింది. కువైత్‌లో నలుగురు తెలుగు వాళ్ళెవరైనా కలిస్తే ఇదే విషయమై చర్చించుకునే వారు.
సామాజిక మాధ్యమాలలో చెబుతున్నట్లుగా ఒక్కరు కాదు తాను ఇద్దరు మహిళల మృతదేహాలపై లభించిన ఆభరణాలను ఆసుపత్రిలో సిబ్బంది సమక్షంలో స్వీకరించి కాగితాలపై సంతకాలు చేశానని, తాను స్వీకరించిన ఆభరణాలను సీసీటీవీ కెమెరాలలో రికార్డు కూడా అయినట్లుగా సదరు వ్యక్తి చెప్పారు.
తాను వ్యక్తిగత పనుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్ళిన తర్వాత వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా తనపై కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం నుండి బుధవారం తిరిగి వచ్చిన తాను నేరుగా భారతీయ ఎంబసీకి వెళ్ళి ఇద్దరు మహిళల ఆభరణాల ప్యాకెట్లను ఇచ్చే ప్రయత్నం చేయగా, మృతుల కుటుంబసభ్యులకు అప్పగించాలని వారు సూచించారని చెప్పారు. వాటిని మృతుల కుటుంబసభ్యులకు అప్పగిస్తానని ఆయన వివరించారు.
కాగా, మొదలు ఈ కేసులో ఒక మృతురాలి కుటుంబ సభ్యులు సదరు వ్యక్తిని సంప్రదిస్తే తాను ఏ రకమైన ఆభరణాలను స్వీకరించలేదని చెప్పి వారి విషయంలో దురుసుగా ప్రవర్తించారని కువైత్‌లోని కొందరు చెప్పారు. ఆ తర్వాత వారు కొన్ని సాక్ష్యాలు చూపడంతో మాట మార్చారని అన్నారు.
ఇదిలా ఉండగా, కువైత్ నుండి స్వదేశానికి మృతదేహాలను పంపించడం మాత్రమే ప్రధాన పనిగా ఉన్న సదరు వ్యక్తి ప్రతి మృతదేహాన్ని పంపించడానికి ఖర్చుల పేర అవతలి వ్యక్తి అవసరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా వీసా నియమాలను ఉల్లంఘించిన కేసులలో స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకునే తెలుగు వారి నుండి కూడా డబ్బులు వసూలు చేశాడనే అరోపణలు ఉన్నాయి.
తన రాజకీయ ప్రస్థానాన్ని సహించలేని కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన కొట్టిపారేసారు. తాను డబ్బు తీసుకున్నట్లయితే రుజువు చేయాలని సవాలు విసిరారు.
ఇవీ చదవండి:
గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్ వర్ధంతి.. టీడీపీ కార్యకర్తల ఘన నివాళులు
టీఏజే సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు