Share News

ఫ్రాంక్‌ఫర్ట్‌లో అంగరంగ వైభవంగా ‘తెలుగు సంబరం 2026’

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:05 PM

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (TAG) ఆధ్వర్యంలో ‘తెలుగు సంబరం 2026’ కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఫ్రాంక్‌ఫర్ట్‌లో అంగరంగ వైభవంగా ‘తెలుగు సంబరం 2026’
Telugu Sambaram 2026

జర్మనీ, సెప్టెంబర్ 22, 2026: తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (TAG) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు సంబరం 2026’ కార్యక్రమం జర్మనీలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ఘనంగా చాటిచెప్పింది. జర్మనీ నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగు కుటుంబాలు, సాంస్కృతిక ప్రతినిధులు, విద్యార్థులు, ప్రముఖులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రసంగించారు. అనారోగ్య కారణంగా ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు. వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘మనం ఎక్కడున్నా మన మూలాలను మరువకూడదు. తండ్రి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, గురువు.. ఈ ఐదింటినీ జీవితంలో ఎప్పుడూ విస్మరించరాదు” అని అన్నారు.

1.jpg


జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తూ, ఆధునిక రంగాల్లో రాణిస్తూనే తెలుగు ప్రజలు తమ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభాషను గుండెల్లో దాచుకుని కాపాడుకుంటున్న తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. జర్మనీ నలుమూలల నుంచి తెలుగు వారిని ఒక తాటిపైకి తెచ్చి, వారి సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిరక్షించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

‘ఇంట్లో పిల్లలతో తప్పనిసరిగా అమ్మభాషలోనే మాట్లాడాలి. ఎన్ని భాషలు నేర్చుకున్నా, మన ఆలోచనలకు ప్రాణం పోసేది మాతృభాష మాత్రమే’ అని ఆయన ఉద్ఘాటించారు. జర్మనీలో పెరుగుతున్న తెలుగు పిల్లలు భవిష్యత్తులో గ్లోబల్ సిటిజన్లుగా ఎదిగినా, వారి మూలాలు తెలుగు నేలతో, భారతీయ సంస్కృతితో దృఢంగా అనుసంధానమై ఉండాలని ఆకాంక్షించారు.

2.jpg


భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే సంకల్పంతో ముందుకు సాగుతోందని, ఈ మహాయజ్ఞంలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమని వెంకయ్య నాయుడు తెలిపారు. భారతదేశంలోని నవతరం ఈ సంకల్పాన్ని మరింత బలపరుస్తూ, దేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.

‘తెలుగు సంబరం 2026’లో తెలుగు భాషా సాహిత్యం, సంగీతం, నృత్యం, జానపద కళలు, సంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం తెలుగు ప్రజల ఐక్యతను, సాంస్కృతిక చైతన్యాన్ని, భావితరాల పట్ల వారి బాధ్యతను ప్రతిబింబించింది.

3.jpg


ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ జనరల్ సుచిత కిషోర్, శాసనమండలి మాజీ సభ్యులు టీడీ జనార్దన్, ప్రముఖ సినీ నటులు నిఖిల్ సిదార్థ, నెక్కంటి నిషాంత్, వేగుంట మధుసూదన్ రావు తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ జవ్వాజి, రామ్ బొల్లా, మోహన్ జొన్నలగడ్డకి వివిధ రంగాల్లో సేవలు అందించినందుకు విశిష్ట పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (TAG) కార్యవర్గ సభ్యలు నరేష్ కోనేరు, సుమంత్ కోర్రపాటి, శ్రీకాంత్ కుడితిపూడి, శివ బత్తల, వంశీ దాసరి, వెంకట్ ఖండ్ర, దినేష్ కోవి, ఫర్హత్ మీర్జా, వంశీ ఉండవల్లి తదితరులు పాల్గొన్నారు. అరవింద్ చౌదరి, లీల ధారపనేని, రవి తేజ ఖాజా, మనోజ్ గుట్లపల్లి, మహేంద్ర కొండ్రెడ్డి, టీఏజీ స్టూడెంట్స్ వింగ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.


ఈ వార్తలనూ చదవండి:

నెబ్రాస్కాలో వైభవంగా టీఎస్ఎన్ వనభోజనాలు

కాలిఫోర్నియాలో వెంకట్ నాగం ’రచ్చబండ చర్చలు’, ’కలగూర గంప పుస్తకాల’ ఆవిష్కరణ

Updated Date - Sep 23 , 2026 | 05:30 PM