బహ్రెయిన్ నుండి మాతృభూమికి చేరుకోనున్న తెలుగు పాస్టర్లు
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:49 PM
క్రైస్తవ ధార్మిక సదస్సు కోసం బహ్రెయిన్‌కు వెళ్లి ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు క్రైస్తవ బోధకులు తాము మాతృభూమికి చేరాలంటూ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రార్ధనలు ఫలించాయి. త్వరలో వారు భారత్‌కు చేరుకోనున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: క్రైస్తవ ధార్మిక సదస్సు కోసం బహ్రెయిన్‌కు వెళ్లి ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు క్రైస్తవ బోధకులు మాతృభూమికి తిరిగెళ్లడం కోసం గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రార్థనలు ఫలించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత వారం రోజులుగా చేస్తున్న కృషి ఎట్టకేలకు మంగళవారం ఫలితాన్నిచ్చింది. బహ్రెయిన్ నుండి రోడ్డు మార్గాన సౌదీ అరేబియాకు చేరుకున్న పాస్టర్లు సౌదీ అరేబియా నుండి మంగళవారం కొచ్చికి బయలుదేరారు. అక్కడి నుండి బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ సతీశ్ కుమార్, ఏపీ ఎన్నార్టీ అధికారులు, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ సహాయంతో పాస్టర్లు సురక్షితంగా భారత్‌కు బయలుదేరారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలోని తెలుగుదేశం పార్టీ నాయకుల సమన్వయంతో ఎన్నారైలు సౌదీ అరేబియాకు చేరుకుని అక్కడి నుండి మాతృదేశానికి బయలుదేరారు. క్రైస్తవ మత బోధకులు, ఇతర పర్యాటకులతో పాటు బహ్రెయిన్‌లో నివాసముంటున్న కొందరు ప్రవాసాంధ్రులు కూడా ఈ ప్రత్యేక విమానంలో భారతదేశానికి బయలుదేరారు.

బహ్రెయిన్‌లో క్రైస్తవ ధార్మిక సదస్సులో పాల్గొనడానికి భారత్, ఇతర గల్ఫ్ దేశాల నుండి వచ్చిన 128 మందిలో సగం మంది సదస్సు అనంతరం ఫిబ్రవరి 27 తమ తమ దేశాలకు బయలుదేరారు. మిగిలిన వారు మరుసటి రోజు తిరుగుప్రయాణం కావాల్సి ఉంది. ఈ మేరకు వీరు బహ్రెయిన్‌లోని విమానాశ్రయానికి చేరుకుని బోర్డింగ్ పాసులు పొంది ఇమిగ్రేషన్ లాంఛనాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ లోపు ఇరాన్ క్షిపణి దాడులు మొదలు కావడంతో బహ్రెయిన్ అకస్మాత్తుగా తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో వీరందరూ అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. వీరిని మొదట జుఫ్ఫర్ అనే ప్రాంతానికి తరలించగా దానికి సమీపంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులు చేయడంతో మరో ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది.
ఇరాన్ – అమెరికా యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుండడంతో బహ్రెయిన్ గగనతలం మూసివేశారు. బహ్రెయిన్ పొరుగున ఉన్న సౌదీ అరేబియాలో విమానాలు నడుస్తున్నాయి. సాధారణంగా రోడ్డు మార్గాన సౌదీకి చేరుకొని అక్కడి నుండి వీరు హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. కానీ సౌదీ అరేబియాలో ప్రవేశించడానికి వీసా అవసరం. వీరికి ఈ వీసా జారీలో జాప్యం జరిగింది.
ఈ సమస్యను క్రైస్తవ సంఘాలు కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడంతో ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు పాస్టర్లకు సౌదీ వీసా కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీలైతే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రాంమోహన్ నాయుడును కోరడంతో అధికారులు ఆ మేరకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక దశలో వీరికి ప్రభుత్వ ఖర్చుపై టిక్కెట్లను కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు రప్పించాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించగా కేంద్ర అధికారులు నిరాకరించినట్లుగా సమాచారం.

వీరు నాలుగు రోజుల క్రితమే సౌదీకి రోడ్డు మార్గాన చేరుకోవాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వలన అది కుదరలేదు. గల్ఫ్ ఎయిర్ అధికారులతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని భారతీయ రాయబార కార్యాలయాలు కూడా వీరి విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు తెలుగు దేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా కృతజ్ఞతలు తెలిపారు.
బహ్రెయిన్‌లో వీరికి తెలుగు కళా సమితి అధ్యక్షుడు జగదీశ్, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు హరిబాబు, మోహన్, రఘునాథ్ బాబు, శివకుమార్, సతీశ్ శెట్టి, సతీష్ బొల్ల, బాలకృష్ణ తదితరులు వీడ్కోలు పలికారు. సౌదీ అరేబియాకు చేరుకున్న వీరికి తెలుగుదేశం పార్టీ పక్షాన రంజీత్ చిట్లూరి, జాకీర్‌ల బృందం స్వాగతం పలికింది. తెలుగు దేశం గల్ఫ్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ సూచనల మేరకు వీరికి ఆహారం అందించడంతో పాటుగా విమానాశ్రయంలో తెలుగుదేశం బృందం సహాయ సహకారాలను అందించిందని పార్టీ నాయకులు ఖాలీద్ సైఫుల్లా, జానీ షేఖ్‌లు వెల్లడించారు.

ఈ వార్తలూ చదవండి:
నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి