చికాగో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని దుర్మరణం
ABN , Publish Date - May 18 , 2026 | 03:29 PM
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
నల్గొండ/చికాగో , మే 18: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
నవ్య తన మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) డిగ్రీ పూర్తి చేయడం కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లింది. శనివారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి పార్ట్ టైమ్ ఉద్యోగానికి వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది. అమెరికాలోని నవ్య స్నేహితుల ద్వారా ఈ సమాచారం తమకు తెలిసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
స్థానిక ఇండియానా స్టేట్ పోలీస్ నివేదికల ప్రకారం.. క్రౌన్ పాయింట్ (Crown Point) సమీపంలోని ఇంటర్‌స్టేట్ 65 హైవేపై రాత్రి 11:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నవ్యతో పాటు ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనం హైవైపే సుమారు 10-15 మైళ్ల వేగంతో వెళ్తోంది. ఆ మినివాన్ ముందు వెళ్తున్న మరో వాహనంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, దాన్ని అనుసరిస్తూ ఈ మినివాన్ వేగాన్ని తగ్గించింది.
అయితే, వెనుక నుంచి వస్తున్న కారు డ్రైవర్, ఈ మినివాన్ ఇంత నెమ్మదిగా వెళ్తుందనే విషయాన్ని గమనించలేకపోయాడు. చివరి నిమిషంలో ప్రమాదాన్ని నివారించేందుకు కారును ఎడమ వైపుకు తిప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అది మినివాన్ ఎడమ భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావంతో మినివాన్ రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది.
నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎం.ఎస్ పూర్తి చేసి ఉన్నత ఆశయాలతో ఉన్న నవ్య అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, నవ్య భౌతికకాయాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు అమెరికాలోని తానా, ఆటా ప్రతినిధులతో మాట్లాడి చర్యలు చేపడుతున్నానని వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఒక షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఆ మినివాన్‌లో ముందు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఐదుగురు ప్రయాణికులు (నవ్య సహా) వెనుక భాగంలో ఎలాంటి సీట్ బెల్టులు లేకుండా, మామిడి పండ్ల బాక్సులపై కూర్చుని ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో మినివాన్‌లో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మొదట స్థానిక ఆసుపత్రులకు తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం చికాగో పరిధిలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. నవ్య మరణవార్తతో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. నవ్య మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్