Share News

దుబాయి వ్యాపారవేత్తకు తెలంగాణ ప్రభుత్వం తరఫున చొప్పదండి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 08:17 AM

దుబాయి రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు తెలంగాణ ప్రవాసీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన యూఏఈ వ్యాపారవేత్త, బర్జీల్ సంస్థ చైర్మన్ డాక్టర్ షంషీర్ వయలీల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు.

దుబాయి వ్యాపారవేత్తకు తెలంగాణ ప్రభుత్వం తరఫున చొప్పదండి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయి రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు తెలంగాణ ప్రవాసీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిన యూఏఈ వ్యాపారవేత్త, బర్జీల్ సంస్థ చైర్మన్ డాక్టర్ షంషీర్ వయలీల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ షంషీర్ ప్రతినిధులైన యం.ఉన్నికృష్ణన్, డాక్టర్ పంకజ్ కుమార్, అహ్మద్ బిన్ సులేమాన్‌లను శుక్రవారం దుబాయిలోని ఆయన కార్యాలయంలో కలుసుకుని పేద కుటుంబాలను ఆదుకున్నందుకు అభినందనలు తెలిపారు.

డాక్టర్ షంషీర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సిబ్బందిని ఎమ్మెల్యే కలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష దిర్హాంలు అనగా భారతీయ మారకంలో 26 లక్షల రూపాయల చొప్పున డాక్టర్ షంషీర్ ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

vayalil.jpg


ఎమ్మెల్యే వెంట దుబాయిలోని తెలంగాణ సంక్షేమ, సాంస్కృతిక సంఘం (జి.డబ్యూసి.సి.ఎ) ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాస రావు, సలాఒద్దీన్, శామ్యూల్ దామోరలతో పాటు కాంగ్రెస్ నాయకులు యస్విరెడ్డి, ఎన్నారై సలహా మండలి సభ్యుడు కొట్టాల సత్యం గౌడ్, దుబాయి గోమాత సంరక్షణ సమితి నాయకులు సుతారి సత్యం, తెలంగాణ ప్రవాసీ ప్రముఖులు కోరేపు మల్లేష్, ద్యాగతి మహిపాల్ యాదవ్, ముజఫర్, ఒడ్డ్యాడ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే పర్యటనను తెలంగాణ ప్రవాసీ వ్యవహారాల అధ్యయన కమిటీ ఉపాధ్యక్షుడు మంద భీంరెడ్డి, సభ్యుడు నంగి రెడ్డి సమన్వయం చేశారు. యు.ఎ.ఇలోని ప్రఖ్యాత భారతీయ వ్యాపారి కుటంబానికి చెందిన డాక్టర్ షంషీర్ కార్యాలయానికి ఎమ్మెల్యే వెంట ముందస్తుగా ఇచ్చిన సమాచారం కంటే ఎక్కువ మంది వెళ్లారు. దీంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది.


ఈ వార్తలనూ చదవండి:

డెన్మార్క్‌లో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి

దుబాయిలోని ప్రవాసీ మలయాళీ దాతృత్వం

Updated Date - Jun 13 , 2026 | 08:30 AM