డెన్మార్క్‌లో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి
ABN , Publish Date - Jun 12 , 2026 | 07:43 AM
డెన్మార్క్‌లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు
ముఖ్య అతిథులుగా పాల్గొన్న నందమూరి రామకృష్ణ, మన్నవ సుబ్బారావు
వర్చువల్‌గా ప్రసంగించిన మంత్రి కొల్లు రవీంద్ర, కొమ్మారెడ్డి పట్టాభిరామ్
తెలుగును బతికించడమే ఎన్టీఆర్‌కు ఇచ్చే అతిపెద్ద నివాళి అన్న వక్తలు
డెన్మార్క్‌లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ యూరప్ సమన్వయకర్త, కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్ పోట్లూరి అధ్యక్షత వహించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయించాలని టీడీపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని వక్తలు కొనియాడారు. అవినీతి, అరాచకం, విధ్వంసంతో ఏపీలో సాగిన జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడి, కూటమి సుపరిపాలన ప్రారంభమై రెండేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ద్వితీయ వర్థంతి సందర్భంగా ఆయనకు సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు జాతికి, తెలుగు భాషకు ఎన్టీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. మాతృభాషను విస్మరించిన ఏ సమాజమైన మృత సమాజంగా మిగులుతుందని తెలిపారు. ఎల్లలు దాటి వేరొక దేశంలో స్థిరపడ్డా ప్రవాసాంధ్రులు తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకుంటున్నారని కొనియాడారు. అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. తాము మద్రాసులో పుట్టినా ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడుకునే వాళ్లమని రామకృష్ణ తెలిపారు.
పాలనలో విప్లవాత్మక మార్పులు తెదేపాతోనే
కూటమి ప్రభుత్వ 24 నెలల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పథంలో 20 ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు. ‘ప్రవాసాంధ్రులు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలని... అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

కూటమి గెలుపులో ప్రవాసాంధ్రుల కృషి ఎనలేనిది.....
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని మంత్రి కొల్లు రవీంద్ర, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. 24 నెలల చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోందని వివరించారు. భారీగా పెట్టుబడులు వస్తున్నాయని...గూగుల్ లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం చరిత్రాత్మకమని తెలిపారు. కార్యక్రమంలో డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు అమర్ నాథ్ పోట్లూరి మాట్లాడుతూ.. యూరప్‌లో అతి పెద్ద తెలుగు సంఘం డెన్మార్క్‌లో ఉందని తెలిపారు. తెలుగు భాషకు ప్రాధాన్యమిస్తూ తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు తమ పిల్లలకు చక్కటి తెలుగు నేర్పిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై డెన్మార్క్‌లోని ప్రవాసాంధ్రులు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిబాబు చెరుకూరి, సీతారామయ్య జాస్టి, సుధాకర్ చాగంటి, మధుబాబు నిమ్మగడ్డ, బాలకృష్ణ యాగంటి, ప్రవీణ్ జంపని తదితరులు పాల్గొన్నారు.






తానా ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు