దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:27 PM
దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురికి సాధారణ వార్డులో చికిత్స అందిస్తుండగా వీరిలో హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సయీద్ కూడా ఉన్నారు. ఇక విషమ పరిస్థితుల్లో ఉన్న ఐదుగురిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు.
మృతులు ముగ్గురూ కూడా జగిత్యాల జిల్లాకు చెందిన వారేనని ప్రాథమిక సమాచారం. కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం (51), మల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన గొల్లపలి తిరుపతి గౌడ్ (42), మెట్ పల్లి మండల కేంద్రంలోని గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీఖ్ (37)లు ఈ ప్రమాదంలో మరణించారు. మృతదేహాలను భారత్‌కు పంపించడానికి దుబాయిలోని భారతీయ కాన్సులేటు అధికారులు మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని భారతీయ అధికారులు పరామర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా భారీగా శబ్దం వినిపించిన తర్వాత తమకు స్పృహ తప్పిపోయిందని, కళ్లు తెరిచి చూసే సరికి ఆసుపత్రిలో మంచంపై ఉన్నట్టు అర్థమైందని ఒక బాధితుడు చెప్పినట్లు తెలిసింది. బాధితులను దుబాయిలోని సామాజిక కార్యకర్త గుండెళ్లి నరసింహ కూడా పరామర్శించారు.
షార్జా కేంద్రంగా ఉన్న ఒక అల్యూమినియం డోర్ ఫ్రేం, గ్లాసుల పరిశ్రమలో వీరందరు పని చేస్తున్నారు. సంస్థ యజమాని కేరళకు చెందిన వ్యక్తి అని సమాచారం. అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో రోడ్డుపై ఆగిపోయిన లారీని వెనక నుంచి వచ్చి మినీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కార్మికులు ప్రయాణిస్తున్న మిని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని కూడా పేర్కొన్నారు.
తానా వేసవి క్రీడాసంబరాలు... పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు విశేష స్పందన
అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి ఇషాన్వి