దుబాయిలోని ప్రవాసీ మలయాళీ దాతృత్వం
ABN , Publish Date - Jun 10 , 2026 | 09:10 PM
దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు ప్రముఖ ప్రవాసీ భారతీయుడు, మలయాళీ వ్యాపారి అండగా నిలిచారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థికసాయం ప్రకటించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2.5 కోట్ల ఆర్థిక సాయం
తెలంగాణలో బాధిత కుటుంబాలతో సంప్రదింపులు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏడుగురు మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారందరికీ ప్రముఖ ప్రవాసీ భారతీయుడు, మలయాళీ వ్యాపారి అండగా నిలిచారు. బాధిత కుటుంబాల సహాయార్థం మొత్తం రెండున్నర కోట్ల రూపాయాలను విరాళంగా ఇస్తానని వెల్లడించారు.
తమ కుటుంబాల భవిష్యత్తు కోసం గల్ఫ్ బాట పట్టిన పేద ప్రవాసీయుల కుటుంబాలకు మానవతా దృక్ఫథంతో వీలైనంతగా సహాయం చేయడం తనకు ఆత్మ సంతృప్తిని కల్గిస్తుందని యుఏఈలోని ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారి, బర్జీల్ గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ షంషీర్ వయలీల్ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

దుబాయి రోడ్డు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులతో పాటు మిగిలిన నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికీ 26 లక్షల రూపాయాల చొప్పున డాక్టర్ షంషీర్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అదే విధంగా గాయపడిన తొమ్మిది మందికి కలిపి 47 లక్షల రూపాయాలను చికిత్స, పునరావాసం కోసం ఇస్తున్నట్లుగా వెల్లడించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబ సభ్యులు దుబాయికు వెళ్లి రావడానికి, దుబాయిలో వసతి, భోజనం కోసం అదనంగా 18 లక్షల రూపాయాలను కేటాయిస్తున్నట్లుగా చెప్పారు. బాధిత కుటుంబాల పిల్లల చదువుల కోసం 13 లక్షల రూపాయాలను కూడా ఆయన విరాళంగా ప్రకటించారు.
దుబాయిలోని భారతీయ కాన్సులేటు సహాయంతో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారుల ద్వారా తెలంగాణలోని బాధిత కుటుంబాలను డాక్టర్ షంషీర్ సిబ్బంది సంప్రదింపులు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
కేరళకు చెందిన డాక్టర్ షంషీల్‌కు యుఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా దేశాలలో ఆసుపత్రులు, వైద్య రంగం సంబంధిత సంస్థలు ఉన్నాయి.
తానా ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు