Share News

సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ కార్యక్రమం

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:27 PM

సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావాన్ని ప్రతిబింబించారు.

సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ కార్యక్రమం
TDP Iftar Riyadh

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో తెలుగు తమ్ముళ్ళు కదం తొక్కారు. ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం సంధ్య వేళ.. ఒక వైపు రంజాన్ ఆధ్యాత్మికత, సోదరభావాన్ని ప్రతిబింబించగా మరో వైపు ఎడారి నాట తెలుగుదేశంపై అభిమానం పరవళ్లు తొక్కింది.

యుద్ధ ఉద్రిక్తతల మధ్య శుక్రవారం సాయంత్రం సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మదనపల్లె శాసన సభ్యుడు షాజహాన్ బాషా మాట్లాడుతూ అన్ని మతాలకు చెందిన వారిని సమ న్యాయంగా, మానవీయ కోణంలో చూసే ఏకైక నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు, ఇతర అల్ప సంఖ్యాక వర్గాలు సీఎం చంద్రబాబుపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనవల్సి ఉన్నా చివరి క్షణంలో విమానం రద్దై రాలేకపోవడంతో వీడియో కాల్ ద్వారా తెలుగుదేశం శ్రేణులతో మాట్లాడారు.

5.jpg


ఇటీవల బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన క్రైస్తవ పాస్టర్లను స్వదేశానికి తరలించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా తెలిపారు.

ప్రవాసీ కార్మికుల ముగింట ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని హోటల్‌లో కాకుండా కార్మిక క్షేత్రంలో నిర్వహించామని పార్టీ ఎన్నారై నాయకులు జానీ బాషా, రాజశేఖర్, ఖాలీద్ సైఫుల్లాలు ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ప్రవాసాంధ్రుడికి చేదోడువాదోడుగా ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. రానున్న స్ధానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం విజయానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

7.jpg


తెలుగుదేశం పార్టీ నాయకులు సారథి నాయుడు, భవానీ శంకర్, హరి, నరేశ్ చెన్నుపాటి, చంద్ర కొడావళీ, ముజ్జమ్మీల్ షేఖ్, రంజీత్, నరేంద్ర పెళ్ళూరు, నవీన్ కుమార్, వెంకట రావు గుత్తాలు కార్యక్రమాన్ని సమన్వయం చేయగా శిల్పా గడ్డం, అక్షిత చెన్నుపాటి, జయలక్ష్మి సుగవాసిలు కార్యక్రమ రూపకల్పనలో తోడ్పాటునందించారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్ల ర్యాలీను కూడా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది కార్మికులు ఉత్సాహంగా కులమతాలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రవాసీయులు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే.

1.jpg2.jpg3.jpg9.jpg8.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

ఆటా మహాసభలు.. మేరీల్యాండ్ గవర్నర్‌కు ఆహ్వానం

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

Updated Date - Mar 14 , 2026 | 02:29 PM