వాషింగ్టన్ డి.సిలో వైభవంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Mar 30 , 2026 | 09:46 PM
అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) ప్రాంతంలో మార్చి 29న 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారని భానుప్రకాష్ మాగులూరి అన్నారు. మార్చి 29న అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) ప్రాంతంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భాను మాగులూరి మాట్లాడుతూ 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత అనే విధంగా తెలుగునాట ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో పార్టీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని అన్నారు.
సమాజంలో ఆనాడు నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితి, అసమానతలను తొలగించి బడుగు, బలహీన వర్గాల వారికి అధికార ఫలాలు దక్కేలా టీడీపీ చేసిందని అన్నారు. పార్టీ ఏర్పాటు తరువాత ఎన్టీఆర్ తొమ్మిది నెలల పాటు రాష్ట్రంలో అవిశ్రాంతంగా పర్యటించి ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు. ఇది గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో సైతం నమోదయ్యిందని చెప్పారు. దేశంలో సంక్షేమ రాజ్యానికి ఎన్టీఆర్ ఆద్యులని చెప్పారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించి పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించారని అన్నారు. తెలుగుదేశం 44 ఏళ్ళ ప్రస్థాన వేడుకల్లో మరో శతాబ్దం రాష్ట్రానికి, దేశానికి పార్టీ మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నామని చెప్పారు. సమకాలీన పరిస్థితులలో సంక్షోభాలు ఎన్ని ఎదురైనా వెన్నుచూపని, త్యాగధనులైన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం, బలగం అని తెలిపారు.

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానం చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యశస్వి బొద్దులూరి, సుధీర్ కొమ్మి, సాయి బొల్లినేని, రవి అడుసుమిల్లి, సాయిశ్రీనివాస రెడ్డి భూమిరెడ్డి, ఠాగూర్, వెంకటేశ్వర్రావు సామినేని, కిషోర్ కొడాలి, రామకృష్ణ ఇంటూరి, కృష్ణమోహన్ జంపాల, వినీల్ శ్రీరామినేని, మురళికృష్ణ కట్ల, హనుమంతరావు కూచి, రమేష్ రావిపూడి, సీతారామారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలూ చదవండి:
ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు
తానా - పాఠశాల ఆధ్వర్యంలో ‘ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై’