ఫ్రిస్కోలో వేడుకగా టాంటెక్స్ సంక్రాంతి
ABN , Publish Date - Feb 13 , 2026 | 08:06 PM
టాంటెక్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకున్నాయి.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఈ ఏడాది సంక్రాంతి పండుగను సాంస్కృతిక మహోత్సవంగా నిర్వహించింది. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులకు సంస్థ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2025 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త శాంతి నూతి స్వాగత ప్రసంగం చేసి 2026 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన అనిత వేమిరెడ్డిని పరిచయం చేశారు. మైత్రేయి-మన్విత వ్యాఖ్యానం చేశారు.
మంజులత మందపాకల మార్గదర్శకత్వంలో ముఫిన్ అకాడమీ విద్యార్థులు అమెరికా-భారత్‌ల జాతీయ గీతాలను ఆలపించారు. స్థానిక ప్రవాస బాలబాలికలు మహాగణపతిమ్, అష్టలక్ష్మి, జతిస్వరమ్, బ్రహ్మాంజలి, గోవింద గోవింద, బ్రహ్మమొక్కటే వంటి శాస్త్రీయ భక్తి నృత్యప్రదర్శనలతో అలరించారు. గురువులను సత్కరించారు. అనంతరం జరిగిన సినీ, జానపద నృత్య ప్రదర్శనలను ఆకట్టుకున్నాయి. మనబడి విద్యార్థులు అలవైకుంఠపురంలో, రైతు గొప్పతనం నాటికల ద్వారా సాంస్కృతిక, సామాజిక సందేశాలను అందించారు. ధున్కి అకపెల్లా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

2025 టాంటెక్స్ కార్యవర్గాన్ని నిర్వాహకులు సత్కరించారు. మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి పొట్టిపాటి, ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్ కొండ తిరుమలరెడ్డి ప్రసంగిస్తూ ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, ట్రస్టు బోర్డు అధ్యక్షుడు దయాకర్ మాడాలు తమ భవిష్యత్ కార్యాచరణను సభికులతో పంచుకున్నారు. ATA, NATS, TTA, NATA, IANT, TPAD, DARA, GRADA, D-TABS, GTA సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రంగోలీ, వంటల పోటీల విజేతలను సన్మానించారు. స్నిగ్ధ ఎలేశ్వరపు, శైలేష్ ఎరుకుల్ల ప్రదర్శనతో వేడుకలు ముగిశాయి. కార్యక్రమ సమన్వయకర్త కమలాకర్ వందన సమర్పణ చేశారు.



ఇవీ చదవండి:
అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం
బడ్జెట్ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!