Share News

దద్దరిల్లిన దమ్మాం దసరా వేడుకలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:17 PM

సాటా (ఈ.ఆర్) ఆధ్వర్యంలో ఇటీవల దమ్మాం ప్రాంతంలో జరిగిన దసరా-బతుకమ్మ ఉత్సవాలను తిలకించడానికి ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో వచ్చారు.

దద్దరిల్లిన దమ్మాం దసరా వేడుకలు
SATA Dussehra celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మాతృదేశంలో అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది మైసూరు. అదే విధంగా సౌదీలో అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు, దాని కంటే ముందు శరన్నవరాత్రుల ఆధ్యాత్మిక వేడుకలంటే గుర్తుకువచ్చేది దమ్మాంలోని తెలుగు ప్రవాసీ సంఘం సాటా దసరా ఉత్సవాలు. దానికి అదనంగా బతుకమ్మ వేడుకల కనవిందు.


సాటా (ఈ.ఆర్) ఆధ్వర్యంలో ఇటీవల దమ్మాం ప్రాంతంలో జరిగిన దసరా-బతుకమ్మ ఉత్సవాలను తిలకించడానికి ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో వచ్చారు. తమ తమ ఇళ్లల్లో భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు జరుపుకున్న నవరాత్రి వేడుకల అనంతరం జగన్మాత దుర్గామాత నిమజ్జనోత్సవం వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. వేడుకలు జరిగిన భారీ ప్రాంగణం మొత్తం ఉత్సవ శోభ ఉట్టిపడి, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణాన్ని తలపించింది. అదే సందర్భంగా, కొందరు తెలంగాణ మహిళలు బతుకమ్మల చుట్టూ రామ రామ రామ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ తెలంగాణ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేశారు.

SATA Dussehra celebrations


దుష్ట సంహారిణి, శక్తి స్వరూపిణి, భక్తజనుల పాలిట కల్పవల్లి అయిన శ్రీ దుర్గామాత అమ్మ వారి అలంకరణలో లీనా కుమారి, తెలంగాణ ఆడపడుచుల ఆరాధనమైన బతుకమ్మలను ఆకర్షణీయంగా విజయలక్ష్మి (పెద్దపల్లి), కవిత (కరీంనగర్) తమ కళంకరణతో తీర్చి దిద్దారు. వృత్తిరీత్యా కెమికల్ ఇంజినీర్ అయినా ఒక శిల్పి తరహాలో నిజామాబాద్‌కు చెందిన కొక్కుల విశాల్ రూపొందించిన కాకతీయ తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల సందర్భంగా జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలకు సౌజన్య, దిలీప్‌లు మార్గదర్శకత్వం వహించారు.


వేడుకలలో రియాధ్ నగరం నుంచి సాటా ప్రతినిధులు నూరోద్దీన్, సురేశ్, టాసా వ్యవస్థాపకులు తిరుపతి స్వామి, సాట్స్ నాయకులు ఉమా మహేశ్వర రావు, వరప్రసాద్‌లు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

కార్యక్రమ నిర్వహణలో సాటా (ఈ.ఆర్) అధ్యక్షులు పల్లెం తేజ, ప్రతినిధులు షామ్ మోహన్, శిల్పా రవి కీలకపాత్ర వహించగా శ్రవణ్ కుమార్, విశాల్, సతీష్, ఓంప్రకాశ్‌లు వేడుకలను సమన్వయం చేశారు.


ఈ సందర్భంగా ఒక వ్యవసాయ క్షేత్రంలో తోటమాలిగా పని చేసే ప్రవాసాంధ్రుడు వెంకటేశ్ కుమార్తె వివాహానికి సభికులు రెండు లక్షల రూపాయాల ఆర్థిక సహాయమందించడం ఈ రకమైన వేడుకలకు ఆదర్శనీయంగా నిలిచింది.

సాటా (ఈ.ఆర్) ఆధ్వర్యంలో దమ్మాం నగరంలో జరిగే దసరా, సంక్రాంతి వేడుకలు దేశంలోని తెలుగు ప్రవాసీయులు జరుపుకునే పండుగలలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు.


ఈ వార్తలనూ చదవండి:

ఖతర్‌లో ‘తెలంగాణ వైభవం’ వేడుకలు

దాతలు ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డికి శంకరరత్న పురస్కారం

Updated Date - Oct 25 , 2026 | 07:32 PM