Share News

ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డికి శంకరరత్న పురస్కారం

ABN , Publish Date - Oct 25 , 2026 | 02:58 PM

ప్రతిష్ఠాత్మకమైన శంకరనేత్రాలయా వారి శంకరరత్న పురస్కారం-2025 గ్రహీతగా కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు.

ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డికి శంకరరత్న పురస్కారం
Shankara Ratna Award 2025

చెన్నై: శంకరనేత్రాలయా సంస్థ వారి ప్రతిష్ఠాత్మక శంకరరత్న పురస్కారం-2025 గ్రహీతగా కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల, చెన్నైలోని శంకరనేత్రాలయ ప్రధాన ప్రాంగణంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, శోభరెడ్డికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈ పురస్కరాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి శంకర నేత్రాలయ చైర్మన్ డా సురేంద్రన్, శంకరనేత్రాలయ ఇండియా అధ్యక్షుడు డా. గిరీష్ రావు, శంకర నేత్రాలయ అమెరికా అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తితో పాటు, అమెరికా నుండి శ్యామ్ అప్పాలి, ఇ.వి.పి, డల్లాస్ ట్రస్టీ బుచ్చిరెడ్డి గోలి, మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, చెన్నై నగర ప్రముఖులు, శంకర నేత్రాలయ చెన్నై సిబ్బంది, పాత్రికేయ బృందం హాజరయ్యారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ సేవా పురస్కారాన్ని గతంలో తీసుకున్నవారిలో రతన్ టాటా, మాజీ ఇస్రో చైర్మన్ పద్మవిభూషణ్ గ్రహీత డా. జీ మాధవన్ నాయర్, ఎల్ అండ్ టి మాజీ చైర్మన్ పద్మవిభూషణ్ గ్రహీత ఏ ఎం నాయక్, మాజీ టీసీఎస్‌ సీఈఓ పద్మభూషణ్ ఎస్ రామదొరై, మాజీ హెచ్‌డిఎఫ్‌సి పద్మభూషణ్ దీపక్ పరేఖ్, తమిళ చిత్ర దర్శకులు ఎస్‌పి ముత్తురామన్ ఉన్నారు. గతంలో ఈ అవార్డు తీసుకున్న ప్రవాస భారతీయులలో ఎస్‌వి ఆచార్య, బాలరెడ్డి ఇందుర్తి కూడా ఉన్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో, బాలరెడ్డి ఇందుర్తితో పాటు, పూర్వ శంకర రత్న అవార్డు గ్రహీతలైన ఎస్‌పీ ముత్తురామన్, ప్రముఖ తమిళ రచయిత వి. వి రంగనాథన్ హాజరు కావడం మరో విశేషం.

6.jpg


భారత ఉప రాష్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తమిళనాడుతో, మద్రాస్ శంకరనేత్రాలయతో ఉన్న తమ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, కాటంరెడ్డి ప్రసాద రెడ్డి, శోభా రెడ్డి సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరు వీరి సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకుని, మరింత సహకారాన్ని అందించాలని సూచించారు.

శంకరనేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని అనేక రాష్ట్రాలలో శంకరనేత్రాలయ చాప్టర్లు ప్రారంభించామని చెప్పారు. తద్వారా వాలంటీర్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని, వారు శంకరనేత్రాలయ వారు చేసే సేవాకార్యక్రమాలు మరింతమంది దాతల దగ్గరకు తీసుకువెళ్లారని అన్నారు. తద్వారా సంస్థకు కావలిసిన నిధులు, మునుపెన్నడూ లేని విధంగా సమకూర్చడం జరుగుతోందని చెప్పారు. ఇదే సందర్భంలో, ప్రసాద్ రెడ్డి ఈ శంకరారత్న అవార్డుకు పూర్తిగా అర్హులని.. శోభారెడ్డి, ప్రసాదరెడ్డి నిస్వార్ధంగా ఎన్నో సేవాసంస్థలకు అండదండగా ఉంటూ, తమ లాభాలలో రెండు మిలియన్ డాల్లర్స్‌ను ప్రతి సంవత్సరం విరాళంగా ఇస్తారని చెప్పారు. శంకరనేత్రాలయ సంస్థ అంటే, వీరికి ప్రత్యేక అభిమానమని కూడా తెలియజేశారు.
3.jpg


ప్రసాద్ రెడ్డి కుటుంబం, ఇప్పటికే తొమ్మిది క్యాంపులు నిర్వహించి, మరెన్నో కాంప్స్‌ను వచ్చే సంవత్సరం షెడ్యూల్ చేయడం జరిగిందని తెలియజేశారు. వారు చేసిన ప్రత్యేక ధన సహాయంతో, అత్యంత ఆధునిక మార్పులతో, సరికొత్త చెన్నై మేసు (MESU) బస్సు యూనిట్ ఎర్పాటు చేస్తున్నారని తెలియజేశారు.

ప్రసాద రెడ్డి స్వయంగా దాతగానే కాకుండా, శంకరనేత్రాలయ సంస్థలకు సలహాదారుడిగా సేవలు అందిస్తూ, సంస్థ చేపట్టే నిధుల సమీకరణ కార్యక్రమాలకు ప్రత్యేకంగా హాజరవుతూ, శంకరనేత్రాలయ అమెరికా కార్యకర్త శ్రేణులలో ఉత్సాహాన్నినింపుతున్నారని చెప్పారు. మరెంతోమంది కొత్త దాతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరు చేసిన సేవలకు ఇటీవల న్యూజెర్సీ రాష్ట్ర సెనెట్ అభినందిస్తూ ఒక ప్రొక్లెమేషన్ కూడా జారీ చేసింది.

4.jpg


ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, తమ అవార్డు స్వీకార ప్రసంగంలో మాట్లాడుతూ, శంకరనేత్రాలయ సంస్థ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, వందలాదిమంది సేవాకార్యకర్తలు అహర్నిశలు శ్రమించి ఎంతోమందికి కంటిచూపూ తెప్పించడం తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియచేశారు. ఈ సందర్భంగా శంకరనేత్రాలయ సంస్థలకు అదనంగా మరో లక్ష డాలర్ల విరాళాన్ని అందజేశారు. దీనితో ఇప్పటివరకు శంకరనేత్రాలయాకు ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డి ఆరు లక్షల ఇరవై ఐదు వేల డాలర్స్ మొత్తాన్ని అందచేసి సంస్థకు అమెరికాలో అత్యంత ధనసహాయాం చేసిన దంపతులుగా, తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

5.jpg


శంకరరత్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన బాలరెడ్డి ఇందుర్తి తదనంతరం డా గిరీష్ రావు, స్వామినాథన్ చంద్రశేఖర్ (శంకరనేత్రాలయ ఫౌండర్ డా బద్రీనాథ్ సమకాలికులు) మైసూర్‌లోని శ్రీ దత్తపీఠాన్ని సందర్శించి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా బాలరెడ్డి ఇందుర్తి శంకరనేత్రాలయ సంస్థ చేపడుతున్న అనేక ఉచిత కంటి సేవాకార్యాక్రమాల గురించి దాదాపు 40 నిమిషాలకు పైగా స్వామీజీకి వివరించారు. కర్ణాటకలో జరిగే భవిష్యత్ కార్యాచరణలో స్వామీజీ సహాయ సహకారాలు, వారి ఆశీస్సులను అర్థించారు. శంకరనేత్రాలయ వారు చేసే మంచి కార్యక్రమాలకు తన ఆశీస్సులు, సహకారం తప్పక ఉంటుందని స్వామీజీ తెలియజేశారు.

2.jpg


ఈ వార్తలనూ చదవండి:

శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’

కెనడాలో ‘తాకా’ బతుకమ్మ సంబరాలు

Updated Date - Oct 25 , 2026 | 03:32 PM