Share News

యూఏఈలో రంజాన్ క్షమాభిక్షతో 4,700 మంది ఖైదీల విడుదల

ABN , Publish Date - Feb 19 , 2026 | 08:24 PM

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గల్ఫ్ దేశాల పాలకులు అనేక మంది ఖైదీలను విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ బోధనలకు అనుగుణంగా ఖైదీలకు క్షమాభిక్షతో స్వేచ్ఛను ప్రసాదించారు.

యూఏఈలో రంజాన్ క్షమాభిక్షతో 4,700 మంది ఖైదీల విడుదల
UAE Ramadan pardon 2026

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రంజాన్ పవిత్ర మాసంలో సహజంగా గల్ఫ్ దేశాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. పని వేళల తగ్గింపు, సాయంత్రం అనూహ్యంగా పెరిగిపోయే ట్రాఫిక్ గుర్తుకువస్తాయి. గల్ఫ్ దేశాలలోని జైళ్లల్లో సత్ప్రవర్తన కలిగిన అనేక మంది ఖైదీల్లో రంజాన్ మాసం ఒక ఆశాదీపం వెలిగేలా చేస్తుంది. మామూలు నేరాల్లో పట్టుబడి జైలు శిక్షలు అనుభవిస్తున్న అనేక మంది ఖైదీలు విడుదల అవుతారు. ఈ మాసంలో ఖురాన్ బోధనలకు అనుగుణంగా కారుణ్యం కింద గల్ఫ్ దేశాలలో ఎంపిక చేసిన ఖైదీలు ఆయా దేశాల పాలకుల క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలవుతారు.

ముస్లింల పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్‌లో 1856 మంది ఖైదీలను విడుదల చేస్తూ దుబాయ్‌ రాజు షేఖ్ మొహమ్మద్ బిన్ రాషేద్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అబుదాబిలో 1440 మంది ఖైదీలను అబుదాబి రాజు, యూఏఈ అధ్యక్షుడు షేఖ్ మొహమ్మద్ బిన్ జయాద్ విడుదల చేశారు. షార్జాలో 738 మంది, రాస్ అల్ ఖైమాలో 407 మంది, ఫుజిరాలో 125 మంది ఆజ్మాన్‌లో 135 మంది ఖైదీలను విడుదల చేస్తూ పాలకులు హుకుం జారీ చేశారు.


సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్ దేశాలు కూడా పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశాయి. అప్పులు చెల్లించలేక జైలు పాలైన వారి పక్షాన వారు బకాయిపడ్డ డబ్బును కూడా రాజులు తమ సర్ఫే ఖాస్ నుండి చెల్లిస్తారు. సర్ఫే ఖాస్ అనేది వ్యక్తిగత పద్దు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా ఒకప్పుడు నిజాం నవాబులు సర్ఫే ఖాస్ కింద ఉండేవి అనే విషయం ఇక్కడ గమనార్హం.


ఇవీ చదవండి:

ఏపీ బడ్జెట్‌లో ప్రవాసీయులకు చరిత్రాత్మక స్థాయిలో నిధుల పెంపు

అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం

Updated Date - Feb 19 , 2026 | 08:56 PM