ఏపీ బడ్జెట్‌లో ప్రవాసీయులకు చరిత్రాత్మక స్థాయిలో నిధుల పెంపు
ABN , Publish Date - Feb 15 , 2026 | 08:38 PM
ఏపీ బడ్జెట్‌లో ప్రవాసీయుల సంక్షేమానికి కేటాయింపులను ప్రభుత్వం రెట్టింపు చేయడంపై ఎన్నారైలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ గల్ఫ్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌లో ప్రవాసీయుల సంక్షేమానికి ఉద్దేశించిన పద్దును రెండింతలు చేయడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం.. ప్రవాసీయులు, ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మిక వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ముఖ్యమంత్రి యన్.చంద్రబాబు నాయుడు దుబాయ్, ఇతర విదేశీ పర్యటనల సందర్భంగా ప్రవాసీయులకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.
ప్రవాసీయుల సాధకబాధకాలపై స్పందించే ఏపీ ఎన్నార్టీ సంస్థకు నిధుల కేటాయింపును రెండింతలు చేశారు. ఏపీ ఎన్నార్టీకి ఈసారి 11 కోట్ల 22.56 లక్షలను కేటాయించారు. వైసీపీ హయాంలో 2023-24 బడ్జెట్‌లో చివరిసారిగా 5 కోట్ల 41.31 లక్షలను కేటాయించారు. ప్రవాసీయుల సంక్షేమానికి ఉద్దేశించిన ఈ కేటాయింపు పొరుగున ఉన్న తెలంగాణతో సహా దేశంలోని మరే రాష్ట్రంలో కూడా లేదని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపుల పెంపుపై సౌదీ అరేబియాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జానీ బాషా, రాజశేఖర్ చెన్నుపాటిలు హర్షం వ్యక్తం చేశారు. ప్రవాసీయుల సంక్షేమానికి కేటాయింపుల్లో ప్రతి రూపాయి పెంపు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కునే ప్రవాసీయులు, స్వదేశంలోని వారి కుటుంబాల దుఃఖాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒకప్పుడు గల్ఫ్ దేశాల నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చే మృతదేహాలను 550 కిలోమీటర్ల దూరంలోని తమ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు పేద కుటుంబాల ఆర్థిక స్తోమత సరిపోయేది కాదని టీడీపీ నాయకుడు వడ్లమూడి సారథి నాయుడు గుర్తు చేశారు. అంబులెన్సుల అద్దెలు భరించే స్థితి లేక మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరించే పరిస్థితి ఉండేదని అన్నారు. ఆ రకమైన గతాన్ని మర్చిపోయేలా ప్రస్తుతం ఏపీ ఎన్నార్టీ నిర్వహిస్తున్న ఉచిత అంబులెన్సు సర్వీసు ఒక పెద్ద ఊతమని అన్నారు.
విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రా మహిళలకు అన్ని రకాలుగా చేయూతనివ్వడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతను చేతల్లో కూడా చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు గడ్డం శిల్పా అన్నారు.
ప్రవాసీయులతో సహా ప్రతి ఒక్క ఆంధ్రుడు వ్యాపారవేత్తగా ఎదగాలని చంద్రబాబు నాయుడు తరచూ ఉద్బోధిస్తుంటారు. విదేశాలలో నివసిస్తున్న వారు కూడా రాష్ట్రం నుండి తమకు నచ్చిన వస్తువులను తీసుకొచ్చి తమకు తెలిసిన వారికి విక్రయించడం ద్వారా వ్యాపార అలవాటుకు శ్రీకారం చుట్టాలని చెబుతుంటారు. దీనికి తగ్గట్లుగా 50 కోట్ల రూపాయలను కేటాయిస్తామని కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పే ఎంటర్‌ప్రెన్యూర్షిప్‌ను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి 50 కోట్ల ప్రకటించారని, తద్వారా ఇంట్లో కూర్చుని ప్రవాసాంధ్ర మహిళలు కూడా తమ అభిరుచికి అనుగుణంగా వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని మరో తెలుగుదేశం నాయకురాలు అక్షిత అభిప్రాయపడ్డారు.


ఇవీ చదవండి:
అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం
బడ్జెట్ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!