ఖతర్‌లో అందర్నీ ఆకట్టుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:56 PM
విదేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు కేవలం డిజిటల్ సంబంధమే కాకుండా మాతృభూమితో భౌతిక బంధాన్ని కూడా పటిష్ఠం చేసుకోవాలని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: విదేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు కేవలం డిజిటల్ సంబంధమే కాకుండా మాతృభూమితో భౌతిక బంధాన్ని కూడా పటిష్ఠం చేసుకోవాలని, స్వదేశానికి వెళ్లినప్పుడల్లా తమ పల్లెలలో గడపాలని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హితువు పలికారు. తాను సుదీర్ఘ కాలం అమెరికాలో ఉన్నా మాతృభూమిలోని మూలాలను ఎప్పటికీ మరువలేదని అన్నారు. అందుకే రాజకీయాలలో వచ్చి ప్రజా సేవ చేస్తున్నానని చెప్పారు.
విదేశాలలో కష్టపడి సంపాదించి వచ్చిన వారు డబ్బు రాజకీయాలతో నష్టపోవద్దని కూడా ఆయన సూచించారు. కనీసం ఒక పాతిక ఏళ్లు విదేశాలలో డబ్బు సంపాందించిన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించాలని ఆయన చెప్పారు. ఎక్కడ ఉన్నా తమ తమ ఊళ్లతో సంబంధాలు కల్గి ఉండాలని సూచించారు. నిజాయితీ, నిబద్ధతతో ప్రజా సంబంధాలు పెంచుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ బంధం ద్వారా ఓటర్ల ఆదరణ పొందినట్లుగా మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు.

ఒక అంతర్జాతీయ టెలికం సదస్సులో పాల్గొనడానికి ఖతర్‌కు వచ్చిన ఆయన నిమిషం కూడా తీరిక లేకున్నా కూడా తెలుగు ప్రవాసీయులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఓపికగా సమావేశమవుతూ వారికి హితబోధనలు చేయడం ద్వారా అందర్నీ ఆకట్టుకున్నారు.
స్వతహాగా ప్రవాసీ అయిన ఆయన, అయిదు వేల కోట్ల రూపాయాలతో ప్రస్తుత లోక్ సభ సభ్యులందరిలోకెల్లా సంపన్నుడు, యువకుడు, పార్టీ నాయకత్వానికి విధేయుడు, ప్రభుత్వంలో సమర్థుడిగా గుర్తింపు పేరొందిన వైనం, వ్యక్తిత్వం ప్రవాసీయులందర్నీ ఆకర్షించింది.
మంత్రి గౌరవార్థం బుధవారం రాత్రి రాయబారి డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విందులో భారతీయ ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని వీలయినంత ఎక్కువ మందిని పిలిచారు.

ఈ సందర్భంగా తనను కలిసిన తెలుగు ప్రవాసీయులతో మాట్లాడుతూ 15 బిలియన్ డాలర్ల భారత్ నెట్ ప్రాజెక్టు, డిజిటిల్ విప్లవ ఫలితాల గురించి వివరించారు.
తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా టెలికం టవర్లు నిర్మించినా వాటి నిర్వహణన గాలికి వదలడంతో అవి సక్రమంగా పని చేయక సెల్ ఫోన్ సిగ్నల్స్ సమస్య ఏర్పడిందని చెప్పారు. తాను మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం టవర్ల పని తీరు రెట్టింపు స్థాయిలో మెరుగవడంతో పాటు దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 20 వేల నుంచి 50 వేలకు పెరిగిందని అన్నారు. మరో రెండు సంవత్సరాలలో ఈ సంఖ్యను 2 లక్షల 70 వేలకు పెంచడం ద్వారా కనెక్టివిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా పెమ్మసాని వెల్లడించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం టెక్నాలజీని ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రవాసాంధ్రులకు వివరించారు.

బుధవారం వివిధ సందర్భాలలో ప్రవాసాంధ్రులను కలుసుకున్న ఆయన సాయంత్రం రాయబారి ఇంట్లో అందరితో కలిసి మాట్లాడారు.
గురువారం సాయంత్రం కూడా ఖతర్‌లోని తెలుగుదేశం పార్టీ వర్గాలతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. మంత్రితో విడివిడిగా సమావేశమైనా అవతలి వైపు ఏమి మాట్లాడింది తెలుసుకోనే ప్రయత్నం చేశారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్కర్నీ కలుసుకోవడానికి పెమ్మసాని ఆసక్తి చూపారు. తనకు మొబైల్‌పై ఫోన్ చేసిన ప్రతి ఒక్కరినీ పలకరించి హోటల్‌కు పిలిపించారు.
అంతకుముందు, అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలకు సరిహద్దులు లేవని చెప్పారు. అన్ని దేశాలు కలిసి వీటిని ఎదుర్కోవాలని, అందరు పాఠాలు నెర్చుకోవాలని సూచించారు. ఆర్థిక లావాదేవీలలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు.
తెలుగు రాయబారి వచ్చిన అనంతరం ఇది తొలి విందు సమావేశం కావడం, కేంద్ర మంత్రి కూడా ఒకప్పుడు స్వయానా తెలుగు ప్రవాసీ కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. విందుకు హాజరైన తెలుగు వారందరూ కూడా మంత్రి, రాయబారితో తెలుగులో మాట్లాడడంతో అతికొద్ది మంది ఇతర రాష్ట్రాల ప్రముఖులు ఒకింత అసహానానికి గురయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఖతర్‌లో కమ్మని వేడుకగా కాకతీయ వనభోజనాలు
తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు