గల్ఫ్‌లోని తెలుగు కార్మికుల జీవిత కథ ‘నా ప్రయాణం’ పుస్తకావిష్కరణ
ABN , Publish Date - May 03 , 2026 | 04:24 PM
పొట్టకూటి కోసం గల్ఫ్‌లో ఉంటున్న తెలంగాణ వాస్తవ్యుడు నరేష్ తన అభిరుచి అయిన రచనావ్యాసంగంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పొట్ట కూటి కోసం ఎడారి దేశానికి వచ్చి రేయింబవళ్ళు కాయకష్టం చేస్తూ మరో వైపు వీలైనప్పుడల్లా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్న నారి (దడిగే) నరేష్ అరబ్బు ఎడారులలోని తెలుగు ప్రవాసీ రచయితలలో ఒకరు.
ఒమాన్‌లోని మున్సిపాల్టీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేసే నరేష్ దశాబ్ద కాలానికా పైగా ప్రవాసంలోని తన స్వీయ అనుభవాలతో గల్ఫ్ గోసల పేరిట రచించిన అనేక కథనాలను ‘నా ప్రయాణం’ అనే సంపుటిని వెలువరించారు. దీన్ని ఇటీవల జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒమాన్‌లోని భారతీయ రాయబారి జి.వి.శ్రీనివాస్ ఆవిష్కరించారు. మస్కట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులతో పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన నరేష్ పేదరికం కారణంగా ఇంటర్ విద్యను అర్థాంతరంగా మానేసి యుక్త వయస్సులో ఎడారిబాట పట్టారు. ‘ఉండడానికి మనస్సు ఒప్పుకోవడం లేదు.. తిరిగి వెళ్ళడానికి ధైర్యం చాలదు.. కుటుంబ భాద్యతలు గుండెను రాయిగా మార్చడంతో గత్యంతరం లేక ఎడారులలో బతుకుతున్న తీరు’కు ప్రతిరూపమే తన రచనలని ఆయన అంటారు. తన ఇద్దరు చిన్నారులను గుర్తుకు వస్తే అన్నం ముద్ద దిగదని, కన్నీటి చెమ్మలు ఆగవని.. అర్ధరాత్రిగా ఒక్క సారిగా నిద్ర నుండి లేచి కన్నీరు పెట్టుకున్న అనుభవాలే తన పుస్తకమని నరేష్ అన్నారు.
ఒక ప్రవాసీ సగటు కార్మికుడిగా తన అనుభవాలతో పాటు తెలుగు భాష, సాహిత్యంపై మక్కువ, అభిరుచి కూడా తనను ఈ దిశగా ప్రొత్సహించాయని ఆయన అన్నారు.
మానవీయ కోణం, న్యాయ సూత్రంగా రచనలు చేసిన కాళోజీ, అలిశెట్టి ప్రభాకర్‌లు తనకు నచ్చిన రచయితలని నరేష్ వెల్లడించారు.
తెలుగు సాహిత్యం అంటే పేరు, ప్రతిష్ఠ ఉన్న రచయితలే కాకుండా మట్టిలో మాణిక్యం లాంటి నరేష్ తరహా యువ రచయితలను ప్రోత్సహించవల్సిన ఆవశక్యత ఉందని ఒమాన్‌లోని తెలంగాణ సమితి అధ్యక్షుడు నూనె లక్ష్మణ్, సీనియర్ నాయుకుడు సుంకరి రవి అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
వైభవంగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
ఆస్ట్రేలియాలకు వలస వెళ్లిన వారిలో భారతీయులే టాప్