ఆస్ట్రేలియాలకు వలస వెళ్లిన వారిలో భారతీయులే టాప్
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:02 PM
విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాలో ఉంటున్న వారిలో భారతీయులు సంఖ్యాపరంగా నెం.1 స్థానంలోకి వచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాలో ఉంటున్న వారిలో సంఖ్యాపరంగా ప్రస్తుతం భారతీయులు టాప్‌లోకి వచ్చారు. ఇంగ్లండ్ వారిపై స్వల్ప ఆధిక్యంతో నెం.1 స్థానంలోకి నిలిచారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2025 జూన్ 30 నాటికి దేశ జనాభా 27.6 మిలియన్లు. వీరిలో విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాకు వలసొచ్చిన వారి సంఖ్య 8.83 మిలియన్‌లు. దేశ జనాభాలో వలసొచ్చిన వారి వాటా 32 శాతం.
విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాలో ఉంటున్న వారి సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవడం 1891ల తరువాత ఇదే తొలిసారి. అప్పట్లో గోల్డ్ రష్ సందర్భంగా ఆస్ట్రేలియాకు విదేశీయులు భారీగా తరలివెళ్లారు. అయితే, 1947 నాటికి విదేశీయుల వాటా 9.8 శాతానికి తగ్గింది. ఇక గత పదేళ్లల్లో ఆస్ట్రేలియాకు వలసలు అధికం కావడంతో దేశ జనాభా 3.8 మిలియన్‌ల మేర పెరిగింది.
ప్రభుత్వ డేటా ప్రకాకం, ఆస్ట్రేలియాలో ఉంటున్న 971,020 మంది భారత్‌లో పుట్టిన వారే. ఇంగ్లండ్ నుంచి వచ్చిన వారి సంఖ్య 970,950గా ఉంది. ఇక గత నాలుగేళ్లల్లో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వలసెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు, వారి కుటుంబాల వలసలు పెరిగాయి. అయితే, ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియాకు వలస వెళుతున్న వారి సంఖ్య గత పదేళ్లల్లో క్రమంగా తగ్గింది. 2013లో గరిష్ఠంగా మిలియన్ మంది ఇంగ్లండ్ ప్రజలు వెళ్లగా ఆ తరువాత వలసల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత రెండేళ్లల్లో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది.
ఇక ఆస్ట్రేలియాలో ఉంటున్న విదేశీయుల్లో సంఖ్యా పరంగా చైనీయులు మూడో స్థానంలో ఉన్నారు. వీరి జనాభా 732,000. న్యూజిలాండ్ పుట్టిన ఆస్ట్రేలియాలో పుట్టిన వారి సంఖ్య 638,000గా ఉంది. ఫిలిప్పీన్స్ ఐదో స్థానంలో ఉంది. ఇక విదేశీయులు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా 8వ స్థానంలో ఉంది. 2025-26 సంవత్సరంలో 2.6 లక్షల మంది ఆస్ట్రేలియాకు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.