ఆంధ్రా మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన గల్ఫ్ టీడీపీ కార్యకర్తలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 08:54 PM
సందర్శక వీసాపై వచ్చి మరణించిన ఒక పేద మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఒమాన్‌లోని తెలుగు తమ్ముళ్లు ముందుకు వచ్చారు. ఇందుకు అవసరమైన ఖర్చులు తాము చెల్లించి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహకరించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని దాదాపు ప్రతి ప్రవాసాంధ్రుడు ఒక ఉద్యోగే. కొందరు వ్యాపారస్తులు మినహా, మిగతా వారు తమ ఉద్యోగ విధుల్లో నిమగ్నమై ఉంటూ వీలు చేసుకొని అదే పని గంటల మధ్యలో తోటి తెలుగువారికి సహాయం చేయడం ప్రశంసనీయమైన విషయం. ఎడారి నాట ఇబ్బందులను ఎదుర్కొనే తెలుగువారికి తోడుగా ఉండే విషయంలో ఒమాన్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతరుల కంటే ముందంజలో ఉండే ప్రయత్నం చేస్తారు. తద్వారా సల్తనత్‌లో నిజమైన సామాజిక సేవా స్ఫూర్తిని వెల్లువెత్తిస్తున్నారు.
సందర్శక వీసాపై వచ్చి మరణించిన ఒక పేద మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఒమాన్‌లోని భారతీయ ఎంబసీతో సహా అందరూ నిధుల లేమి కారణంగా చేతులెత్తేసిన నేపథ్యంలో తామున్నామంటూ తెలుగు తమ్ముళ్లు ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా చిత్తవరం గ్రామానికి చెందిన మురళ రాజమణి అనే మహిళ సందర్శక వీసాపై ఒమాన్‌కు వచ్చి అనారోగ్యంతో గత సంవత్సరం డిసెంబర్ 4న మరణించింది. మృతదేహాన్ని స్వదేశానికి పంపించాల్సిందిగా ఆమె కుటుంబసభ్యులు అటు విజయవాడలోని ఏపీ ఎన్నార్టీ సంస్థతో పాటు ఇటు భారతీయ ఎంబసీకి విజ్ఞాపనలు పంపించారు. ఈ విషయంలో సహాయం చేయవల్సిందిగా ఏపీ ఎన్నార్టీ అధికారులు మస్కట్‌లోని భారతీయ ఎంబసీని కోరారు.
మృతదేహాలను పంపించడానికి తమ వద్ద నిధులు లేవని మస్కట్‌లోని భారతీయ ఎంబసీ నిస్సహాయత వ్యక్తం చేయడంతో రాజమణి మృతదేహాం రెండు నెలలకు పైగా మస్కట్‌లో పడిఉంది. ఈ నేపథ్యంలో మానవీయ కోణంలో మస్కట్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్నారై అభిమానులు స్పందించారు. ఇందుకు అవసరమైన డబ్బును వారు తలో కొంచెం చెల్లించి రాజమణి మృతదేహాన్ని ఇటీవల స్వదేశానికి పంపించారు.
దళారుల మాటలను నమ్మి సందర్శక వీసాలపై ఒమాన్‌కు ఉద్యోగాన్వేషణ కోసం వచ్చి మోసపోకూడదని టీడీపీ నాయకులు గరిపాటి సత్య శ్రీధర్, యం.రాజేశ్‌లు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి:
ఏపీ బడ్జెట్‌లో ప్రవాసీయులకు చరిత్రాత్మక స్థాయిలో నిధుల పెంపు
అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం