Naari Shakti Award: ఖతర్‌లో తెలంగాణ ప్రముఖురాలికి నారీశక్తి సమ్మాన్ ఆవార్డు
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:26 PM
ఖతర్‌లోని తెలంగాణ ప్రముఖురాలు నందిని అబ్బగౌనికి నారీ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నందిని అబ్బగౌని .. ఖతర్‌లో పరిచయం అక్కర్లేని పేరు. వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలతో ఎడారి దేశం ఖతర్‌లో భారతీయతను ప్రతిబింబిస్తున్న ఆమె ఎడారి దేశంలో బతుకమ్మ ఆడబిడ్డగా కూడా ప్రాచుర్యం పొందారు. గల్ఫ్ దేశాలలో సాంస్కృతిక, సాహితీ రంగాలలో తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి ఉద్దండులు సైతం వెనుకంజ వేస్తున్న కాలంలో తన గడ్డ గురించి గొప్పగా చెప్పి ‘నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ’ అని గొంతెత్తి చాటిన యువ వీర నారి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఖతర్‌లోని భారతీయ ఎంబసీ.. మహిళల శక్తిసామర్థ్యాలు, ప్రతిభ, సేవలకు గుర్తింపుగా నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు పలువురు మహిళలను ఎంపిక చేసింది. వీరిలో నందిని కూడా ఒకరు. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
దోహా నగరంలో భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలోని ఐ.సి.సిలో జరిగిన పురస్కార కార్యక్రమంలో నందినికి ఖతర్‌లోని భారతీయ రాయబారి విపుల్ ఈ ఆవార్డును ప్రదానం చేసారు. తెలుగు ప్రవాసీ ప్రముఖలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాసీ ప్రముఖులు, భారతీయ దౌత్య, ఇతర అధికారవర్గాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుదీర్ఘ కాలం తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలిగా కూడా పని చేసిన నందిని ఖతర్‌లో బతుకమ్మ సంబరాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. బతుకమ్మ సందర్భాల నుండి శ్రీ హరి కోట రాకెట్లు, గోల్కొండ చరిత్ర వరకూ ఆమె భారతీయ పురోగతి, సాంస్కృతిక వైభవం గురించి వివరించిన తీరు ఖతర్‌లోని భారతీయులందరి మన్ననలనూ పొందింది.
అవార్డు ప్రదాన కార్యక్రమంలో కూడా తెలంగాణ కళలు, సాంస్కృతిక వైభవం ఉట్టిపడే విధంగా నందిని గద్వాల చీర నమూనా, కట్టు.. ఆమెలోని ఆత్మవిశ్వాసం, తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పింది. గద్వాల పట్టు చీరల డిజైన్లు బంగారు తెలంగాణ నైపుణ్యత, కళలను ప్రతిబింబిస్తాయని నందిని చెబుతారు. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనంగా కట్టుబాట్లు కూడా ఉండాలంటారు.
పక్కా హైదరాబాదీ, యూసుఫ్ గూడకు చెందిన ఆమె విద్యాధికురాలు. బహుభాషా కోవిదురాలు. ఆమె భర్త శ్రీధర్ గౌడ్ కూడా దేశంలో క్రియాశీలక తెలుగు సామాజిక కార్యకర్తలలో ఒకరిగా ఉన్నారు. ఈ దంపతులిద్దరూ కూడా ఖతర్‌లోని తెలుగు సమాజంలో తమకంటూ ఒక భూమికను కలిగున్నారు. పక్కా తెలంగాణ వాదిగా, కల్వకుంట్ల కవితకు ఖతర్‌లో ముఖ్య అనుచరురాలిగా ఉన్నప్పటికీ ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరితో నందిని సమ్మిళితమవుతారు. నందిని ఖతర్‌లోని ప్రముఖ భారతీయ సాంస్కృతి, మహిళ సంఘాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు.
ఇవీ చదవండి:
బహ్రెయిన్‌లో వైభవంగా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు
మరో షాకిచ్చిన అమెరికా! మార్చ్ 1 నుంచీ..