Share News

Sathyanarayana Vratham: బహ్రెయిన్‌లో వైభవంగా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 06:54 PM

బహ్రెయిన్‌లో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వైభవంగా సాగాయి. ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణుడి నామస్మరణతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు

Sathyanarayana Vratham: బహ్రెయిన్‌లో వైభవంగా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు
Sathyanarayana Vratham in Bahrain

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: నూతన సంవత్సరాదిని వైదిక స్తోత్రంతో స్వాగతం పలుకుతూ ఇష్టదేవతలను సతీసమేతంగా పూజ చేయడం ద్వారా సంవత్సరమంతా శుభం కలగాలని కోరుకోవడం సహజం. నిత్యం సత్యదీప్తితో వెలుగొందే సత్యనారాయణ స్వామిని నిర్మలమైన మనస్సుతో ప్రతిష్టించుకోవడం ద్వారా బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికాయి (Sathyanarayana Vratham In Bahrain).

ఎన్ని వ్రతాలున్నా తెలుగు వారికి వ్రతమంటే సత్యనారాయణ వ్రతమే! బ్రతుకు పోరాటంలో భాగంగా తాత్కాలికంగా అరబ్బు దేశానికి వచ్చినా ఆధ్యాత్మికంగా సత్యనారాయణ వ్రతమే శాశ్వత సుఖ సంతోషాలను చేకూర్చగలుగుతుందని అనేక మంది తెలుగు ప్రవాసీయులు విశ్వసిస్తారు.

Vratham.jpg


బహ్రెయిన్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి సాంస్కృతిక సంస్థ ప్రపథమంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పాల్గొని పరవశించారు. అన్నవరం పుణ్యక్షేత్రం నుండి ప్రత్యేకంగా వచ్చిన పురోహితుల బృందం ఆధ్వర్యంలో జరిగిన వ్రతంలో వేద మంత్రోచ్ఛారణతో పలువురు దంపతులు స్వామి వారి చింతనలో తన్మయత్వం చెందారు. వేద పండితులు కొదుకుల పవన్, ఆకెళ్ళ సాయితేజ శర్మలు వివరించిన వ్రత కథను భక్తులందరూ ఆసక్తిగా విన్నారు.

గతంలో కూడా సత్యానారాయణ వ్రతాలను నిర్వహించినా అన్నవరం నుండి ప్రత్యేకంగా వచ్చిన పురోహితుల నేతృత్వంలో సామూహికంగా జరుపుకోవడం మాత్రం ఇదే ప్రప్రథమం. రద్దీ దృష్ట్యా ఉదయం నుండి రాత్రి వరకు వంతుల వారీగా కార్యక్రమం కొనసాగింది.

బహ్రెయిన్‌‌తో పాటు పొరుగున సౌదీ అరేబియా నుండి భక్తులు వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. సాక్షాత్తూ అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతంతో లభించే మానసిక ప్రశాంతత తమకు లభించిందని సౌదీ అరేబియా నుండి ప్రత్యేకంగా వచ్చి వ్రతంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గెడ్డవలసల నరేష్, వసంతకుమారి దంపతులు వ్యాఖ్యానించారు.

Bahrain.jpgSathyanaraya Swamy Vratham.jpg


ఇవీ చదవండి:

మరో షాకిచ్చిన అమెరికా! మార్చ్ 1 నుంచీ..

కోమటి జయరామ్‌కు పదవి.. బే ఏరియాలో సంబరాలు..

Updated Date - Jan 11 , 2026 | 07:08 PM