US Visa Premium Processing: మరో షాకిచ్చిన అమెరికా! మార్చ్ 1 నుంచీ..
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:00 PM
అమెరికా ప్రభుత్వం మరో షాకిచ్చింది. వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు ప్రకటించింది. కొత్త చార్జీలు మార్చ్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ (USCIS) తాజాగా వెల్లడించింది. కొత్త రేట్స్ మార్చ్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. హెచ్-1బీ, ఎల్-1 సహా పలు రకాల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును చార్జ్ చేస్తుంటుంది. హెచ్-1బీ లాంటి వీసాల విషయంలో గతంలో 2,805 డాలర్లుగా ఉన్న ప్రీమియం ఫీజు ప్రస్తుతం 2,965కి పెరిగింది. విదేశీ ఉద్యోగుల వీసా దరఖాస్తు పరిశీలనను వేగవంతం చేసేందుకు అమెరికా సంస్థలు ఈ ఫీజును చెల్లిస్తుంటాయి. ఇక ఎఫ్-1, జే-1వంటి వీసాల ప్రీమియం ఫీజు కూడా 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది (US Visa Premium Fee Hike).
2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ పేర్కొంది. జాబ్స్ మారే వారు, వీసాలను రెన్యూవల్ చేసుకునే విదేశస్తులపై ఈ పెంపు భారం పడనుంది. ఫీజు పెంపుతో వచ్చే అదనపు నిధులతో తమ కార్యకలాపాలను మరింత సరళతరం చేసేందుకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. వీసా దరఖాస్తుల బ్యాక్‌లాగ్స్ తగ్గడంతో పాటు వీసా దరఖాస్తుల పరిశీలన ఇతర సేవలు మరింత వేగవంతం అవుతాయని చెప్పింది. వీసా సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు సరిదిద్దడమే తమ లక్ష్యమని కూడా వెల్లడించింది.
వలసల కట్టడికి ఇప్పటికే అమెరికా ప్రభుత్వం వివిధ మార్గాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే చిక్కులు తప్పవని ఇటీవల భారతీయ ఎంబసీ ఎక్స్ వేదికగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
ఫుడ్ బ్యాంక్‌లకు తానా మిడ్-అట్లాంటిక్ వాలంటీర్ల భారీ విరాళం
అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం