లండన్‌లో భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా! వీధిలో పాన్ ఉమ్మేశారని..
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:39 PM
లండన్ వీధుల్లో పాన్ తిని ఉమ్మేసిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై అక్కడి కోర్టులు భారీ జరిమానా విధించాయి. ఒక్కొక్కరికీ 1,391 పౌండ్‌ల జరిమానా విధించాయి.
ఇంటర్నెట్ డెస్క్: లండన్ వీధుల్లో పాన్ నమిలి ఉమ్మేసినందుకు ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై అక్కడి న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరిపై 1,391 పౌండ్‌ల (దాదాపు రూ.1.72 లక్షలు) జరిమానా విధించింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఎడ్గవేర్ ప్రాంతానికి చెందిన అక్షిత్‌కుమార్ పటేల్ కింగ్స్‌బరీ రోడ్డులోని ఒక మెట్రో స్టేషన్ సమీపంలో పాన్ ఉమ్మేయడంతో నార్త్‌వెస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు మొదట కొంత జరిమానా విధించింది. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకునేందుకు అక్షిత్ కుమార్ ముందుకు రాకపోవడంతో జరిమానా చివరకు పదింతలైంది. తాజాగా జరిగిన విచారణకూ అతడు రాకపోవడంతో కోర్టు 1,391 పౌండ్‌ల జరిమానా విధించింది.
మరో కేసులో రూయిస్‌లిప్ ప్రాంతానికి చెందిన హితేశ్ పటేల్‌పై కూడా ఇదే మొత్తాన్ని కోర్టు జరిమానాగా విధించింది. వెంబ్లీరోడ్‌లో అతడు పాన్ ఉమ్మేసిన ఉదంతంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో హితేశ్ కూడా కోర్టు విచారణకు హాజరుకాలేదు. నార్త్ వెస్ట్ లండన్ ప్రాంతంలో జనాలు ఇలా ఉమ్మేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో కోర్టులు ఈ స్థాయి జరిమానాలు విధించాయట.
బహిరంగ ప్రదేశాల్లో ఈ అలవాటుకు అడ్డుకట్ట వేసేందుకు సిటీ కౌన్సిల్ (పురపాలక సంస్థ) ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఈ అలవాటు కారణంగా నగరంలోని బహిరంగ ప్రదేశాలు అందవిహీనంగా మారుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ఈ మరకలను తొలగించేందుకు అధికారులు ఏటా 30 వేల పౌండ్స్‌ను వెచ్చిస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది.
ఇవి కూడా చదవండి..
అమెరికా వ్యాప్తంగా మోసాలు! భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ గాలింపు
అత్యంత ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ చదరంగ టోర్నమెంట్ 2026