ఫ్రిస్కోలో జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి రచనల ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:12 PM
కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నాడు ఫ్రిస్కోలో జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నాడు ఫ్రిస్కోలో జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక, కళావాహిని, టాంటెక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కొసరాజు కవితావైభవం పేరిట సిద్ధాంత వ్యాసాన్ని రచించి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీ.హెచ్.డీ పట్టాతో పాటు బంగారు పతకం అందుకున్న ప్రముఖ రచయిత డా. నల్లూరి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రామారావు మాట్లాడుతూ మట్టి పరిమళాలను గట్టిగా పట్టుకుని కొసరాజు జానపదాలకు సరికొత్త సువాసనలు అద్దారని కొనియాడారు. ఆయన రచనలను ఉటంకించారు. శ్రీనాథ పద నిఘంటువు, తిక్కన పదకోశం మాదిరి కొసరాజు పద నిఘంటువు రూపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. పల్లెజీవనశైలిని అతిసమీపంగా గమనించిన ఆయన వాటినే తన పాటలకు పునాదులుగా చేసుకున్నారని తెలిపారు. కొసరాజు రచించిన గండికోట యుద్ధం ఆయనలోని మరో కోణాన్ని స్పృశిస్తుందని వెల్లడించారు.

మద్దుకూరి చంద్రహాస్ మాట్లాడుతూ వ్యంగ్యానికి, హాస్యానికి చిరునామాగానే గాక దూరదృష్టితో వాస్తవికతను ప్రతిబింబించే రచనలు చేసిన ప్రతిభాశాలి కొసరాజు అని కొనియాడారు. టోపీ, లారీ, సిగరెట్, ఇల్లరికం, పేకాట, పకోడి..ఇలా వస్తువు ఏదైనా సహజసిద్ధమైన పదజాలంతో రాఘవయ్య మంచి పాటలు రాశారని వెల్లడించారు. డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ రాఘవయ్య చౌదరి జానపద కవితా రసరాజుగా చిరస్మరణీయులని పేర్కొన్నారు.
రైతు అన్నదాత, కవి జ్ఞానదాత అని ఇవి రెండూ కలిసిన కొసరాజు సాహితీ చైతన్య ప్రదాత అని అన్నారు. నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్న రాఘవయ్య పరిశ్రమతో, పల్లెకారుల జీవనాన్ని సమీపంగా చూసిన అనుభవాలతో ఆలోచింపజేసే పాటలకు ప్రాణం పోశారని వెల్లడించారు. కొసరాజు సాహిత్యాన్ని రూపొందించే క్రమంలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంత్ మల్లవరపు సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో స్థానిక గాయనీగాయకులు కొసరాజు రచించిన గేయాలను ఆలపించారు.


ఈ వార్తలనూ చదవండి:
దద్దరిల్లిన దమ్మాం దసరా వేడుకలు
ఖతర్‌లో ‘తెలంగాణ వైభవం’ వేడుకలు