యూఎస్‌లో భారత విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతం!
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:34 AM
అమెరికాలో అదృశ్యమైన కర్ణాటక విద్యార్థి సాకేత్ ఉదంతం విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని తాజాగా స్థానిక పోలీసులు గుర్తించినట్టు భారతీయ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం కేసు విషాదాంతమైంది. అతడు మరణించినట్టు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. అతడి మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారతీయ కాన్సులేట్ ఆదివారం వెల్లడించింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలియజేసింది (Saketh Sreenivasaiah Found Dead). సాకేత్ కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. అతడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు స్థానిక అధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.
శ్రీనివాసయ్య లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్‌లీలో (UC Berkeley) కెమికల్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఫిబ్రవరి 9న కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు ముందుకు రావాలని సాకేత్ రూమ్‌మేట్ బనీత్ సింగ్ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఆయన చివరి సారిగా బర్క్‌లీ హిల్స్‌లోని అన్జా సరస్సు వద్ద కనిపించారని అన్నారు. స్థానిక పోలీసులతో కలిసి సాకేత ఆచూకీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇక అన్జా సరస్సు వద్ద సాకేత్ పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగు లభించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అక్కడే పోలీసులకు అతడి మృతదేహం లభించింది. సాకేత్ మృతితో అతడి స్నేహితులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో కూరుకుపోయారు.
ఇవీ చదవండి:
అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం
బడ్జెట్ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!