దుబాయిలో బతుకమ్మ సంబరాలు.. హాజరైన ధర్మపురి అర్వింద్
ABN , Publish Date - Oct 18 , 2026 | 08:23 PM
యూఏఈలోని ప్రముఖ ప్రవాసీ భారతీయ సంఘాలలో ఒకటయిన ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐ.పి.ఎఫ్) తెలంగాణ చాప్టర్ దుబాయిలో శనివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు నిర్వాహకులు ఉహించిన దాని కంటే వైభవంగా జరిగాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: యూఏఈలోని ప్రముఖ ప్రవాసీ భారతీయ సంఘాలలో ఒకటయిన ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐ.పి.ఎఫ్) తెలంగాణ చాప్టర్ దుబాయిలో శనివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు నిర్వాహకులు ఉహించిన దాని కంటే వైభవంగా జరిగాయి.
భారతీయ జాతీయవాదం, సనాతన ధార్మిక విలువల పరిరక్షణ కోసం పాటుపడే ఐ.పి.ఎఫ్ బతుకమ్మ, ఇతర భారతీయ పండుగలను దుబాయిలో ఘనంగా నిర్వహిస్తుంది. గతం తరహా భారీగా కాకుండా, ఈసారి ఎంపిక చేసిన కొద్ది మంది కుటుంబాలతో బతుకమ్మ సంబరాలను ఓ స్థానిక పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వస్తున్నట్లుగా తెలుసుకొన్న సమీప అల్ ఖోజ్ ప్రాంతంలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రవాసీ కార్మికులు తండోపతండాలుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనుకోకుండా వచ్చిన జనాలను అదుపు చేయలేక, పాఠశాల భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

తెలంగాణ పండుగ, సంస్కృతి వారసత్వాన్ని విదేశాలలో కూడా పరిరక్షించడానికి కృషి చేస్తున్న ప్రవాసీయులను అర్వింద్ అభినందించారు. సాధారణంగా తన దుబాయి పర్యటన సందర్భంగా ప్రతిసారీ ధరించినట్లుగా జీన్స్, టీ షర్ట్‌తో వచ్చిన యువకులతో కలిసిమెలిసి గడిపారు. ఆ తరువాత కొన్ని గంటల పాటు ఓపికగా అందరితో ఫోటోలు దిగారు. మహిళలు పేర్చిన బతుకమ్మలను చూస్తూ వారిని అభినందించారు. దుబాయి, ఇతర గల్ఫ్ ప్రవాసీయుల సాధకబాధకల గురించి తనకు అవగాహన ఉందని అన్నారు. దీని కోసం తన వ్యక్తిగత ట్రస్ట్ కూడా నిరంతరం పని చేస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. తన ప్రతి దుబాయి పర్యటనలో వీలయినంత ఎక్కువ మందితో సమావేశం కావాలనే అభిలాష ఉన్నా సమయాభావం వలన కలువలేకపోతున్నందుకు క్షమించాలని కోరుతూ... ఇక నుండి వీలయినంత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తానని పేర్కొన్నారు.

ఎంపీ అర్వింద్‌తో పాటు బీజేపీ నాయుకుడు, వరంగల్ నగరానికి చెందిన మాజీ మంత్రి దివంగత దాస్యం ప్రణయ్ భాస్కర్ కుమార్ కుమారుడు అభినవ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకుడయిన అభినవ్ బీజేపీ తెలంగాణ ప్రవాసీ విభాగానికి సంయుక్త కన్వీనర్‌గా వ్యవహారిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మలు అలంకరించడం, గౌరమ్మకు పూజలు, వాయినాలు సమర్పించడంలో పావని అడ్లగట్ట, రజిత, అపర్ణ తదితరులు పాటుపడ్డారు.
ఐపీఎఫ్ ఉపాధ్యక్షులు రాకేష్ బోహ్రా, జాతీయ కార్యదర్శి రాజీవ్ రంజన్ సింగ్, తెలంగాణ భాద్యులు తలకొక్కుల మదన్, కృష్ణ మేగి, అరె శరత్ గౌడ్, కుంభాల మహేందర్ రెడ్డి, నవనీత్ గాజ, రమేశ్ గౌడ్ గాడర్ల, గోవర్ధన్ యాదవ్, వినోద్ ఆర్మూరీ, కృష్ణా, జగదీశ్ భరతపు, రమేశ్ పిట్ల, యోగేశ్ జమాల్ పూర్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.



ఈ వార్తలనూ చదవండి:
బహ్రెయిన్‌లో ఘనంగా దసరా–బతుకమ్మ సంబరాలు
ఆబుధాబిలో ఆత్మీయంగా బతుకమ్మ సంబరాలు