ఆబుధాబిలో ఆత్మీయంగా బతుకమ్మ సంబరాలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:21 PM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని ఆబుధాబిలో శుక్రవారం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ (TFA) ఆబుధాబి నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ పల్లె బతుకమ్మ సంబరాలను మైమరపించాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: రామా రామా నే ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలతో అరబ్బు నాట ఆడబిడ్డల ఆటపాటల కోలాటాలు, పరాయి గడ్డపై పరిమళ పూల వనాలు, అడవి పూల బతుకమ్మ పండుగ సంబురాలు అరేబియా ఎడారులలో అంబరాన్నంటుతున్నాయి.
తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని ఆబుధాబిలో శుక్రవారం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ (TFA) ఆబుధాబి నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ పల్లె బతుకమ్మ సంబరాలను మైమరపించాయి. మహిళల సామూహిక జీవనసౌందర్యాన్ని తెలంగాణ ప్రవాసీయులు ప్రతిబింబించారు. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మధ్య నిత్యం నిమగ్నమై ఉండే మహిళలకు ఆటవిడుపుగా అందరూ ఒకచోట చేరి స్వంత ఊరిలో ఉన్నట్లుగా సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పంచుకొన్నారు.

సంబరాలకు ముఖ్య అతిధిగా భారతీయ ఎంబసీ సీనియర్ దౌత్యవేత్త సౌమ్య గుప్తా, గౌరవ అతిథిగా మరో దౌత్యవేత్త డాక్టర్ బాలాజీ రామస్వామి, ప్రత్యేక అతిథిగా బీజేపీ నాయకులు దాస్యం అభినవ్, ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు బీజీ థామస్లు పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న ప్రవాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని బతుకమ్మ వేడుకలను తిలకించారు. సంప్రదాయ నృత్యాలతో నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, చిన్నారులు ప్రత్యేక నృత్యాలను ప్రదర్శించారు. భారత్ నుండి వచ్చిన ప్రముఖ కళాకారుడు డాక్టర్ కోకిల నాగరాజు నృత్య దర్శకత్వంలో రూపొందించిన ఈ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అదే విధంగా, మాతృభూమి నుండి వచ్చిన గాయకులు, డాన్సర్లు అంజలి పులింటి, సోనీ యాదర్ల, సోనీ పటేల్లు తమ ఆటపాటలతో అలరించారు. వీరికి తోడుగా స్థానికంగా ఆబుధాబిలో నివసించే కవీష్, సంజన, అభిరామ్లు చక్కటి బతుకమ్మ పాటలతో సభికుల మనస్సులను దోచుకున్నారు.

రాము గౌడ్ కుటుంబ సభ్యులు రూపొందించిన 12 అడుగుల బతుకమ్మ కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలు తయారుచేసి తీసుకొచ్చిన మహిళలకు, సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులను నిర్వాహకులు అందించారు. ‘మన తెలంగాణ సంప్రదాయాన్ని , సంస్కృతిని పరిరక్షించడం కోసమే గత పది సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవం, వివిధ పండుగలకు అందరినీ ఏకం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు TFA అధికార ప్రతినిధి రాజా శ్రీనివాస రావు అన్నారు.
ఈ కార్యక్రమం కోసం పరిశ్రమించిన మహిళ ప్రతినిధులు పావని, అర్చన, పద్మజ, నిధి, వాహిని, ప్రణతి, మిగతా మహిళ ప్రతినిధులను సౌమ్య గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు హాజరైన ఈ సంబరాలలో కొందరు ఇమరాతీ మహిళలు సైతం పాల్గొని ఆడి పాడడం విశేషంగా ఆకట్టుకుంది . తెలంగాణ అస్తిత్వానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం బతుకమ్మ అని వరంగల్కు చెందిన పావని వ్యాఖ్యానించారు. TFA ప్రతినిధులు శ్రీనివాస్, గంగారెడ్డి, వంశీ, అశోక్, జగదీశ్, గోపినాథ్, తదితరులు కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేసారు.










ఈ వార్తలనూ చదవండి:
డబ్లిన్లో ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం.. పాల్గొన్న శ్రీనివాస్ మిరియాల
శంకర నేత్రాలయ ఆర్కాన్సాస్ విభాగం ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’