బహ్రెయిన్‌లో ఘనంగా దసరా–బతుకమ్మ సంబరాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:22 AM
బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దసరా, బతుకమ్మ ఉత్సవాలలో ఎన్నారై మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బహ్రెయిన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పకృతి ఆరాధనతో కూడిన బతుకమ్మ, శక్తికి ప్రతిరూపమైన దుర్గాదేవిల ఇతివృత్తంతో మహిళల సామూహిక జీవనసౌందర్యాన్ని బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీయులు ప్రతిబింబించారు. ప్రవాసంలోని యాంత్రిక జీవనంలో నిత్యం నిమగ్నమై ఉండే తెలుగు కుటుంబాలకు ఆటవిడుపుగా అందరూ ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పంచుకున్నారు.
బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దసరా, బతుకమ్మ ఉత్సవాలలో తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా మహిళలు, చిన్నారులు రంగురంగుల బతుకమ్మలతో ఉత్సాహంగా పాల్గొని, సంప్రదాయక ఆటపాటలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని ప్రతిష్ఠించి, నవదుర్గల అలంకరణలతో దసరా పండుగ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటారు.

ఉత్సవానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భారత రాయబారి డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు వెంకట్ స్వామి, ప్రధాన కార్యదర్శి సతీష్ శెట్టి, కోశాధికారి అరుణ్ కుమార్, బినత, కవిత, ఉష, రేవతి, సింధూజ, శ్వేత, మధుమతి, కావ్య, సంధ్య, ఐశ్వర్య, శ్రీ లక్ష్మి, సుచిత్ర, మమత, ఇతర కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
విదేశీ గడ్డపై తెలుగు పండుగలను ఘనంగా నిర్వహిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించడంలో తెలుగు కళా సమితి చేస్తున్న కృషిని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయని తెలుగు కళా సమితి అధ్యక్షుడు యుగంధర్ కరణం పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించిన ఈ కార్యక్రమం ప్రశంసలను అందుకుంది.


ఈ వార్తలనూ చదవండి:
హ్యూస్టన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమాగమం
కిరణ్ వెంకట పల్లా మృతిపై గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా సంతాపం