ఒమాన్‌లో తెలుగు సామాజిక కార్యకర్తలకు రాయబారి అభినందన
ABN , Publish Date - Feb 24 , 2026 | 08:30 PM
తోటి భారతీయులకు సేవ చేయడంలో ముందున్న కొందరు ఎన్నారైల సేవకులను గుర్తించిన ఒమాన్‌లోని భారతీయ ఎంబసీ ఇటీవల వీరిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల అవసరాలకు అనుగుణంగా భారతీయ ఎంబసీలలో సిబ్బంది లేని నేపథ్యంలో భారతీయ సామాజిక కార్యకర్తలు ముఖ్య భూమిక వహిస్తున్నారు. ప్రత్యేకించి కార్మికులకు దైనందిన వ్యవహారాలలో సహాయసహకారాలు అందిస్తున్నారు. నియమాలు, చట్టాలపై తమకు ఉన్న అవగాహన, సేవపై ఆసక్తితో తోటి వారి సహాయార్థం ముందుకొస్తున్నారు. వీరిలో అత్యధికులు ఫెస్‌బుక్ ఫేంలు కాగా మరికొందరు నిజంగా తోటి వారికి చేయూతను ఇవ్వాలనుకునే వారు.
భౌగోళికంగా గల్ఫ్‌లో సౌదీ అరేబియా తరువాత రెండవ పెద్ద దేశమైన ఒమాన్‌లోని సుదూర ప్రాంతాలలో ఉండే భారతీయులకు చేయూతనివ్వడంలో కేరళకు చెందిన సామాజిక కార్యకర్తలు క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. తోటి భారతీయులకు సేవ చేయాలనే లక్ష్యం కలిగిన కొందరు ప్రవాస భారతీయ సేవకులను గుర్తించిన ఒమాన్‌లోని భారతీయ ఎంబసీ ఇటీవల వీరి సేవలను అభినందిస్తూ ప్రశంసాపత్రాలను అందించింది.

మస్కట్‌లోని భారతీయ ఎంబసీ ఆవరణలో జరిగిన ఓపెన్ హౌజ్ సందర్భంగా వీరిని భారతీయ రాయబారి జి.వి. శ్రీనివాస్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందించారు. మస్కట్‌లో పని చేసే నిర్మల్ జిల్లా సోన్ మండలం జాఫ్రపూర్ గ్రామానికి చెందిన షేఖ్ అహ్మద్ కూడా ఇవి అందుకున్న వారిలో ఒకరిగా నిలిచారు. తన సేవను భారత రాయబారి గుర్తించి అభినందించడం సంతోషంగా ఉందని అహ్మద్ ఈ సందర్భంగా అన్నారు. మస్కట్ నగరంలో తెలంగాణ ప్రవాసీయులకు చెందిన ఒమాన్ తెలంగాణ సమితిలో క్రియాశీలకంగా ఉండే అహ్మద్ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పనులలో ముందుంటారు.
అదే విధంగా హైదరాబాద్ నగరానికి చెందిన సోహేల్ ఖాన్‌కు కూడా ఈ గౌరవం దక్కింది. ఆయన కూడా దక్కన్ వింగ్ విభాగంలో కార్మికుల సంక్షేమం, సాధకబాధకాల విషయంలో హైదరాబాదీలకు చేదోడువాదోడుగా ఉంటారు.
ఈ వార్తలూ చదవండి
ఆంధ్రా మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన గల్ఫ్ టీడీపీ కార్యకర్తలు
యూఏఈలో రంజాన్ క్షమాభిక్షతో 4,700 మంది ఖైదీల విడుదల