హిందూ దేవాలయంలో కాల్పులకు కుట్ర.. యూఎస్ యువకుడి అరెస్టు
ABN , Publish Date - Oct 15 , 2026 | 08:39 AM
అమెరికాలోని ఇల్లినోయ్ రాష్ట్రంలోగల ఓ హిందూ దేవాలయంలో సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన ఓ 19 ఏళ్ల యువకుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఇల్లినోయ్ రాష్ట్రంలోగల ఓ హిందూ దేవాలయంలో మారణహోమానికి కుట్ర పన్నిన ఓ 19 ఏళ్ల శ్వేతజాతి యువకుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అలెగ్జాండ్రోస్ పపోరాకిస్గా గుర్తించారు. పాలటైన్ ప్రాంతానికి చెందిన అతడిని అక్టోబర్ 11న అరెస్టు చేశారు. నిందితుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అక్టోబర్ 30న మరోసారి విచారణ జరగనుంది.
నిందితుడి నుంచి రైఫిల్స్, మందుగుండు సామగ్రి, శ్వేతజాతి ఆధిపత్య సాహిత్యం, మేనిఫెస్టోను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాసియా వారు, ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేసుకోవాలని మేనిఫెస్టోలో ఉన్నట్టు గుర్తించారు. నిందితుడి కుట్ర గురించి పాలటైన్ పోలీసులకు తొలుత అక్టోబర్ 11న మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం అందింది.
దేవాలయంలో కాల్పులకు సంబంధించిన ప్లాన్ ఉన్న పత్రాలను నిందితుడు షేర్ చేసినట్టు తెలిసింది. రైఫిల్స్, ముందుగుండు సామగ్రి, బాడీ ఆర్మర్ వంటి వాటి చిత్రాలను కూడా అతడు షేర్ చేశాడు. నిందితుడు అక్టోబర్ 11నే అరోరా ప్రాంతంలోని ఓ దేవాలయంపై దాడికి సిద్ధమైనట్టు కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే, అతడు ఏ దేవాలయాన్ని టార్గెట్ చేశాడనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదని బుధవారం పోలీసులు తెలిపారు.
ఈ ఘటన తీవ్రతను మాటల్లో చెప్పలేమని పాలటైన్ పోలీస్ చీఫ్ విలియం నార్డ్ తెలిపారు. స్థానికులకు, ప్రార్థనా స్థలాలకు ఎలాంటి అపాయం లేకుండా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. ముప్పును తప్పించిన స్థానిక పోలీసులకు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
మోదీకి వ్యతిరేకంగా.. సీజేపీకి అమెరికన్ల నిధులు!
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ట్రంప్ సర్కారు షాక్