Share News

అంతర్వేది నరసింహస్వామి కళ్యాణోత్సవం! గల్ఫ్ నుంచి తరలివచ్చిన ఎన్నారైలు

ABN , Publish Date - Jan 31 , 2026 | 10:45 PM

అంతర్వేది నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు గల్ఫ్ నుంచి అనేక మంది ఎన్నారైలు తరలివచ్చారు.

అంతర్వేది నరసింహస్వామి కళ్యాణోత్సవం! గల్ఫ్ నుంచి తరలివచ్చిన ఎన్నారైలు
Lakshmi Narasimha Swamy Kalyanotsavam

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారిలో పెట్రో రియాళ్ల సంపాదనలో ఎన్నారైలు నిత్య యాంత్రిక జీవనంలో నిమగ్నమై బిజీగా గడుపుతుంటారు. ఇంత తీరికలేకుండా ఉన్నప్పటికీ మాతృభూమిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య తిరుకళ్యాణ వేడుకలలో పాల్గొనడానికి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అనేక మంది గల్ఫ్ ప్రవాసీయులు స్వదేశానికి తరలివచ్చారు.

తెలుగు రాష్ట్రాలలో విరాజిల్లుతున్న నవ నరసింహ క్షేత్రాలలో ఒకలైన కోనసీమ జిల్లా సఖీనేటిపల్లి మండలం అంతర్వేదిలోని నరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి కళ్యాణంలో భక్త కుటుంబాలు కర్తలుగా ముఖ్య భూమిక వహిస్తుండడంతో పాటు స్వామి పట్ల తమకు ఉన్న భక్తి కారణంగా అనేకులు గల్ఫ్‌లో తమ ఉద్యోగాలు, వ్యాపారాలను పక్కన పెట్టి అంతర్వేదికి వచ్చారు.

అంతర్వేదితో తమ కుటుంబానికి తరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక బంధమని మస్కట్‌లో (ఒమాన్) పని చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన నగిడి అనిల్ అన్నారు. మరణించిన తమ తండ్రి అభిరుచికి అనుగుణంగా ఆయన తన ఉద్యోగానికి సెలవు పెట్టి కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి అంతర్వేదికి వెళ్ళారు.

ఉగ్రనరసింహుడిని కళ్యాణోత్సవంలో కమనీయంగా చూడటం కంటే మించినది మరేమీ లేదని దుబాయిలో విద్యనభ్యసిస్తున్న అంతర్వేది గ్రామానికి చెందిన పోతురాజు తరుణ్ చెప్పారు. లక్ష్మీనారాయాణ కుమారుడైన ఆయన ఊహ తెలిసినప్పటి నుంచీ కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నట్లుగా చెప్పాడు. పరిసర గ్రామాలకు చెందిన సువర్ణ రాజు పరస, సుబ్రమణ్యం పోటిపోతు తదితరులు కూడా దుబాయి నుండి అంతర్వేదికి వచ్చారు.

Gulf 2.jpg


గోదావరి నది అంతంలో స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం ద్వారా లభించే మానసిక ప్రశాంతత మరియు భక్తి పరవశం మాటల్లో వర్ణించలేమని కువైత్ లో పని చేసే రాజేశ్ పెరిచర్ల, ఆడబాల శ్రీనివాస్‌లు వ్యాఖ్యానించారు.

ఏ రకమైన పరిస్థితులు ఉన్నా ప్రతి కళ్యాణోత్సవానికి తాము అంతర్వేదికి వెళ్ళడం ఖాయమని సౌదీ అరేబియాలోని రియాద్‌లో పనిచేసే మహంకాళీ దొమ్మెటి, వీర వెంకట సత్యనారాయణ తోలేటిలు చెప్పారు.

ప్రతి సంవత్సరం తాను కళ్యాణోత్సవానికి వెళ్తానని, కానీ ఈ సారి కొన్ని అనివార్య కారణాల వలన వెళ్ళలేకపోయినట్లుగా ప్రవాసాంధ్ర ప్రముఖుడు ఆనందరాజు గుండబోయిన అన్నారు.


ఇదీ చదవండి:

తెలుగు ప్రవాసీయుల ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ బహ్రెయిన్ – క్లీన్ బహ్రెయిన్’

గల్ఫ్‌లో తెలుగు లోకమంతా లోకేశ్ జన్మదిన జపం

Updated Date - Feb 01 , 2026 | 06:28 PM