Share News

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన మూలాలు తెలుగునేలలోనే: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:25 PM

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషోర్ బాబుకు గుంటూరులో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన మూలాలు తెలుగునేలలోనే: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి
Kishore Babu Chalasani Felicitated

‘ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా, మన మూలాలు తెలుగునేలలోనే.. మన అనుభవం ప్రపంచానికి.. మన సేవ మాతృభూమికే.. ఒక ప్రవాసాంధ్రుడిగా నేను బలంగా ఇదే నమ్మేది’ అని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి కిషోర్ బాబు చలసాని అన్నారు. ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనను గుంటూరులో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సీఎం నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ ఏర్పాటు దోహదపడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు, యువ నేత నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని కిషోర్ బాబును కోరారు.

NRI2.jpg


ఐరోపా దేశాల్లో టీడీపీ బలోపేతానికి ఇదొక అవకాశం: మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ బాబు చలసాని ఎంపిక అభినందనీయమన్నారు. ఆయన నియామకంతో ఐరోపాలో తెలుగుదేశం బలోపేతానికి మరింత కృషిచేసే అవకాశం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ ఏర్పాటులో ఎన్ఆర్ఐల కృషి మరువలేనిదని కొనియాడారు. అందరం కలిసి తెలుగుజాతి ప్రథమస్థానంలో నిలిపే బాధ్యతను తీసుకుందామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చారు.


దేశ విదేశాల్లోని తెలుగువారికి వారధిగా NRI TDP ని నిలవాలి: కిషోర్ బాబు

కిషోర్ బాబు చలసాని మాట్లాడుతూ, గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా సేవ చేసే అవకాశం లభించిందన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి చంద్రబాబు, నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా కృషిచేస్తామని తెలిపారు.

డా. గురురాజా వంటి గొప్ప నాయకుడు NRI TDP గ్లోబల్ ప్రెసిడెంట్‌గా ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐర్లాండ్‌కు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, పారుపల్లి నాగేశ్వరరావు, సామినేని కోటీశ్వరరావు, గోరంట్ల పున్నయ్య చౌదరి, గంటా పున్నారావు, మైనేని రాంప్రసాద్, వడ్లమూడి నాగేంద్రం, సూర్యదేవర రవీంద్రనాథ్, నెలకుదిటి నరహరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

తానా ఒహాయో వ్యాలీ బృందం ఆధ్వర్యంలో ఘనంగా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమం..

బాక్సింగ్ రాణి నిఖత్ జరీన్‌కు ఖతర్‌లో సన్మానం

Updated Date - Sep 13 , 2026 | 05:39 PM