బాక్సింగ్ రాణి నిఖత్ జరీన్‌కు ఖతర్‌లో సన్మానం
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:06 PM
సొంత గొడ్డపై ఆత్మీయుల ఆప్యాయత మధ్యలో ఉన్న వాతావరణం ఖతర్‌లో ఉందని బాక్సింగ్ రాణి నిఖత్ జరీన్ వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతోందని చెప్పారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సొంత గొడ్డపై ఆత్మీయుల ఆప్యాయత మధ్యలో ఉన్న వాతావరణం ఖతర్‌లో ఉందని బాక్సింగ్ రాణి నిఖత్ జరీన్ వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతోందని చెప్పారు.
ఇటీవల దోహాలో తెలుగు ప్రవాసీయులు నిర్వహించిన సన్మాన సభలో ఆమె మాట్లాడుతూ క్రీడారంగంలో తన ఎదుగుదలకు తెలుగు సమాజం అందించిన తోడ్పాటు, ఆదరణ కీలకమని అన్నారు.
గల్ఫ్ ప్రవాస భారతీయుడి కుటుంబంలో జన్మించిన నిఖత్ జరీన్ రెండు పర్యాయాలు ప్రపంచ విజేతగా నిలిచి, రానున్న 2028లో ఒలింపిక్ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. మోకాళ్ల గాయానికి జరిగిన శస్త్ర చికిత్స అనంతరం విరామం తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం ఖతర్‌లో తన బంధువుల వద్ద ఉన్నారు.


సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా మనిషి తన లక్ష్యానికి చేరుకోవచ్చని జరీన్ నిరూపించారని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖతర్‌లోని భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఔత్సాహిక మహిళా క్రీడాకారులకు ఆమె ఒక స్ఫూర్తి దాత అని రాయబారి ప్రశంసించారు.

తెలుగునాట పుట్టిన ఆణిముత్యాల్లాంటి ఆడబిడ్డల్లో నిఖత్ ఒకరని కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన తెలుగు క్రీడా సంఘం (టి.యస్.ఏ) అధ్యక్షుడు అబ్బగోని శ్రీధర్ అన్నారు. నిజామాబాద్‌లోని ఒక మామూలు సంప్రదాయక కుటుంబం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన ఆమె తీరు బాలికలందరికీ స్ఫూర్తిదాయకమని ఖతర్ ప్రీమియర్ లీగ్ అధ్యక్షుడు సిరాజ్ అన్సారీ అన్నారు.
భారతీయ దౌత్యవేత్త హరీష్ పాండే, తెలుగు ప్రవాసీ ప్రముఖులు కె.యస్.ప్రసాద్, కె.కృష్ణకుమార్, నందినిలతో పాటు ఇ.పి. అబ్దుల్ రెహమాన్ (ఐ.యస్.సి), ఏపీ మణికంఠణ్ ( ఐ.సి.సి), షానవాస్ బావా (ఐ.సి.బి.యఫ్), తాహా మొహమ్మద్ ( ఐ.బి.పి.సి), తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
‘నిజం గెలిచింది..’ సౌదీ అరేబియాలో టీడీపీ శ్రేణుల నిరసన
ఫీనిక్స్‌లో స్వరాల పండుగ.. కట్టిపడేసిన ఇళయరాజా కార్యక్రమం!