దుబాయిలో రూ.9 లక్షల ఆసుపత్రి బిల్లు మాఫీ చేయించిన జనసేన
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:22 PM
పొట్టకూటి కోసం దుబాయికు వచ్చి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి దాదాపు 9 లక్షల రూపాయాల బిల్లుతో అల్లాడిపోయిన ఒక పేద మహిళకు దుబాయిలోని జనసైనికులు అండగా నిలిచారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పేదరికంతో పొట్టకూటి కోసం దుబాయికు వచ్చి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి దాదాపు 9 లక్షల రూపాయల బిల్లుతో అల్లాడిపోయిన ఒక పేద మహిళకు దుబాయిలోని జనసైనికులు అండగా నిలిచారు. ఆసుపత్రి బిల్లును మాఫీ చేయించి మహిళను స్వదేశానికి తిరిగి పంపించారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అప్పనపల్లి గ్రామానికి చెందిన బత్తుల పుష్పవతి అనే మహిళ దుబాయికు ఉపాధి కోసం వెళ్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. మొదటి సారి అనారోగ్యం తరువాత ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారానికి మరోసారి గుండెపోటు రావడంతో మళ్లీ ఆసుపత్రి పాలైంది. ఆమె ఆరోగ్యం విషమించడంతో వైద్య చికిత్స కోసం 35 వేల దిర్హాంలకు (దాదాపు 9 లక్షల రూపాయలు) పైగా వ్యయం అయింది. బిల్లు చెల్లించకుండా పుష్పవతి ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యే ఆవకాశం లేకపోవడంతో పుష్పవతి కుటుంబ సభ్యులు స్వస్థలంలో జనసేన నాయకులను సంప్రదించగా వారు దుబాయ్‌లోని జనసేన నాయకులు కేసరి త్రిమూర్తులు, బొబ్బిలి మహేశ్వరరావుల సహాయం కోరారు.
వీరు ఇరువురూ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పేదరికంలో ఉన్న మహిళపై కారుణ్యం ప్రదర్శిస్తూ బిల్లును మాఫీ చేయాలని కోరారు. కేసరి, మహేశ్వరరావుల అభ్యర్థనను మన్నించిన ఆసుపత్రి యాజమాన్యం బిల్లును మాఫీ చేసినట్లుగా వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఆపద కాలంలో రోగికి సహకరించిన నామా విజయ, జాన్ బాబు, సారా, కృష్ణా, ప్రకాశ్‌లతో పాటు ఆసుపత్రి యాజమాన్యానికి కేసరి త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు. పి. గన్నవరం శాసన సభ్యుడు గిడ్డి సత్యనారాయణ కూడా దుబాయి ఆసుపత్రి, జనసేన సేవా తత్పరతను కొనియాడారని ఆయన అన్నారు.
ఈ వార్తలూ చదవండి:
తానా - పాఠశాల ఆధ్వర్యంలో ‘ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై’
హెచ్-1బీ వీసాదారుల కనీస వేతనాల పెంపు! యూఎస్ ప్రతిపాదనలు