డెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ.. సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:41 PM
అమెరికాలోని డెట్రాయిట్‌లో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA), శ్రీ వేంకటేశ్వర టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) సంయుక్తంగా తెలుగు పఠన పోటీలు నిర్వహించాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని డెట్రాయిట్‌లో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA), శ్రీ వేంకటేశ్వర టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) సంయుక్తంగా తెలుగు పఠన పోటీలు నిర్వహించాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమానికి శివరాం యార్లగడ్డ ఆర్థిక సహకారం అందించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న 60 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని తమ తెలుగు పఠనా సామర్థ్యాన్ని ప్రదర్శించారు. చిన్నారుల్లో మాతృభాషపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు తెలుగు భాషా వారసత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజేతలతో పాటు పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఐదో తరగతి వరకు విభాగంలో కాంటన్ మనబడి విద్యార్థులు జస్విత శ్రీకాకుళపు, శ్రీ నాగ ఆదిత్య అట్లూరి, నిషిత మనుబోతు వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. తల్లిదండ్రుల వద్ద తెలుగు నేర్చుకుంటున్న శ్రీకర్ పోలిశెట్టి నాలుగో స్థానం సాధించాడు. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విభాగంలో నోవై మనబడికి చెందిన ఆరాధ్య నవులూరి, దీపిక సిరెమిల్లి వరుసగా మొదటి రెండు స్థానాలు సాధించగా, ట్రాయ్ మనబడికి చెందిన ఆద్య సోలిగె మూడో స్థానం, నోవై మనబడికి చెందిన విద్యుషి చెర్వు నాలుగో స్థానం సాధించారు. పిల్లలు పోటీలో ఉత్సాహంగా పాల్గొనడం, తెలుగు చదవడంపై ఆసక్తిని ప్రదర్శించడం సభికులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో DTA అధ్యక్షురాలు సుబ్రత గడ్డం, సాంస్కృతిక కార్యదర్శి అర్చన చావలి, తానా కార్యదర్శి సునీల్ పంత్రా, శ్రీ వేంకటేశ్వర టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జోగేశ్వరరావు పెద్దిబోయిన తదితరులు పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా శ్రీలక్ష్మి, సిరీష లంక, మాధవి నెక్కంటి, కృష్ణమోహన్ బుడరాజు, శివ ఆదుసుమిల్లిలు వ్యవహరించారు. పిల్లలు తెలుగు భాషను నేర్చుకోవడానికి, చదవడానికి, తమ మూలాలను గుర్తుంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ప్రవాస తెలుగువారు అభిప్రాయపడ్డారు.



ఈ వార్తలనూ చదవండి:
ఫ్రిస్కోలో జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి రచనల ఆవిష్కరణ
దద్దరిల్లిన దమ్మాం దసరా వేడుకలు