Share News

అమెరికాలో వైభవంగా భారతీయత–2026 మహోత్సవం

ABN , Publish Date - Jun 17 , 2026 | 08:11 PM

సత్సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యం, ధర్మం, జ్ఞానం, లోకకల్యాణాలనే శాశ్వత విలువలను ప్రపంచానికి అందించిన మహర్షుల వారసత్వాన్ని చాటిచెబుతూ భారతీయత–2026 కార్యక్రమం వైభవంగా జరిగింది.

అమెరికాలో వైభవంగా భారతీయత–2026 మహోత్సవం
Bharateeyata 2026

ఏవాన్, కనెక్టికట్, జూన్ 13: సత్సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యం, ధర్మం, జ్ఞానం, లోకకల్యాణాలనే శాశ్వత విలువలను ప్రపంచానికి అందించిన మహర్షుల వారసత్వాన్ని చాటిచెబుతూ భారతీయత–2026 కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో, అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 800 మందికి పైగా ప్రేక్షకులు, కళాకారులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఒకే సాంస్కృతిక-ఆధ్యాత్మిక స్ఫూర్తితో పాల్గొనడం విశేషం. సనాతన ధర్మం ప్రజలను ఎలా ఏకం చేస్తుందో, మహర్షుల బోధనలు కాలాన్ని దాటి నేటికీ ఎలా స్ఫూర్తినిస్తున్నాయో ఈ వేడుక ప్రత్యక్షంగా చాటిచెప్పింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ భారత రాయబారి డాక్టర్ మిత్రా వశిష్ఠ హాజరుకాగా, భారత దౌత్య కార్యాలయం, న్యూయార్క్ నుండి సేవాంగ్ గ్యాల్‌ట్సన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఫౌండేషన్ నూతన లోగోను ఆవిష్కరించారు. ‘సత్సంకల్పం సదా కుర్యాత్ – సంకల్పః కార్యసాధకః’ (శుభసంకల్పమే కార్యసిద్ధికి మూలం) అనే ఫౌండేషన్ మూలసూత్రాన్ని ప్రతిబింబించింది. భారతీయ సాహిత్య సంపదలో విశిష్ట స్థానం కలిగిన ‘పరాశర సంహిత’ గ్రంథం ఆవిష్కరణతో సత్సంకల్ప ఫౌండేషన్ ప్రచురణ రంగంలోకి అధికారికంగా ప్రవేశించింది. భారతీయ జ్ఞాన సంప్రదాయాలను పరిశోధించి, సంరక్షించి, భావితరాలకు అందించాలనే ఫౌండేషన్ సంకల్పానికి ఈ గ్రంథావిష్కరణ మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

Satsankalpa Foundation


సత్సంకల్ప ఫౌండేషన్, సుపథ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ‘గురుదేవోభవ’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ రాఘవేంద్రన్ రచించిన ఈ అరుదైన గ్రంథం, గురువుగారి జీవన సందేశాన్ని, గురుతత్వ వైభవాన్ని అభివర్ణిస్తూ, భక్తులకు, భావితరాలకు ఒక విలువైన జ్ఞాననిధిగా నిలవనుంది. ఈ సందర్భంగా సద్గురు శ్రీ శివానందమూర్తి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేస్తున్న సుపథ ఫౌండేషన్ ట్రస్టీ కుమారి రాధారాణిని సన్మానించారు.

అనంతరం ప్రతిష్ఠాత్మకమైన ‘శివానంద స్మృతి పురస్కారం’ ప్రముఖ ఇంజనీర్, రచయిత డాక్టర్ ఏ.వి. శ్రీనివాసన్, ప్రముఖ సాంస్కృతికవేత్త డాక్టర్ కాశీనాథుని ఎం. ప్రసాద్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత పండిత్ వామదేవ శాస్త్రికి (డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ) ప్రదానం చేశారు. భారతీయ జ్ఞాన సంపదను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో వీరు చేసిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పురస్కార ప్రదానం సందర్భంగా డాక్టర్ కాశీనాథుని ‘కర్మ ధర్మం విజ్ఞానం, సేవ, సంస్కృతితో కూడిన జీవితంలో గీతా బోధలను ఆచరించడం’ అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ ఏ.వి. శ్రీనివాసన్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ తాను దశాబ్దాలుగా నేర్చుకున్న విలువైన అనుభవాలను సభికులతో పంచుకున్నారు. పండిత్ శ్రీ వామదేవ శాస్త్రి మాట్లాడుతూ సద్గురు శివానందమూర్తితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని, సనాతన ధర్మం పట్ల తన అనుభూతిని వివరించారు. నిజమైన జ్ఞానమంతటికీ మూలం ఆత్మవిద్యేనని ఆయన పేర్కొన్నారు.

సేవాంగ్ గ్యాల్‌ట్సన్ భారతీయత కార్యక్రమాన్ని, నిర్వాహకుల కృషిని అభినందిస్తూ, భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను కొనియాడారు. డాక్టర్ మిత్రా వశిష్ఠ ‘భారతదేశపు సాఫ్ట్‌ పవర్ ద్వారా భారతీయ ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక ప్రపంచంతో అనుసంధానించడం’ అనే అంశంపై మాట్లాడుతూ, సాఫ్ట్ పవర్ అంటే కాలానుగతంగా నిలిచి, తరతరాలను ప్రభావితం చేసే మన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాల శక్తి అని వివరించారు.

9.jpg


ఈ కార్యక్రమానికి హృదయంగా నిలిచింది భరద్వాజ మహర్షి జ్ఞాన కేంద్రం. భారతీయ ఋషి సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించిన ఈ ప్రదర్శనలో భరద్వాజ మహర్షి జ్ఞాన వారసత్వం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. వైమానిక శాస్త్రం, ఆయుర్వేదం, ధనుర్వేదం, రాజధర్మం వంటి రంగాలలో ఆయన చేసిన కృషిని ఆధునిక దృక్కోణంతో పరిచయం చేయడం అనేకమందిలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించింది. వేల సంవత్సరాల క్రితం భారతీయ ఋషులు ఆలోచించిన విజ్ఞాన పరిమళం నేటి తరానికి అందించింది.

ఈ జ్ఞాన యజ్ఞానికి కళారూపంలో అద్భుతమైన రూపాన్ని అందించినది “Seers of Bharat – Journey of Bharadwaja Maharshi” నృత్యనాటిక. భరద్వాజ మహర్షి జీవితం, తపస్సు, జ్ఞానసాధన, లోకకల్యాణ సంకల్పాన్ని ఆవిష్కరించిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను మరో యుగంలోకి తీసుకెళ్లింది. వివిధ ప్రాంతాల నుండి, వివిధ వయస్సుల కళాకారులు పాల్గొన్న ఈ ప్రదర్శన కళ, భక్తి, సంస్కృతిల సమ్మేళనంగా నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మహాయోగి శ్రీ శివానంద మూర్తి జీవితం, బోధనల నుండి ప్రేరణ పొంది, శ్రీధర్ తాళ్ళపాక నాయకత్వంలో ప్రారంభమైన సత్సంకల్ప ఫౌండేషన్ భారతీయ జ్ఞానాన్ని సంరక్షించడం, సంప్రదాయాలను ఆచరణలో కొనసాగించడం, శాశ్వత విలువలను భావితరాలకు అందించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ‘ఋషి సంపద సంరక్షణ – ధర్మాచరణ – భారతీయత పరంపర’ అనే త్రిసూత్రాన్ని తన కార్యాచరణకు మూలాధారంగా స్వీకరించి, భారతీయ జ్ఞాన వారసత్వాన్ని సమాజానికి చేరవేయడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

8.jpg


ఈ మహోత్సవంలో మరో విశేషం సనాతన ధర్మంలో అత్యున్నత విలువగా భావించే ‘అతిథి దేవో భవ’ భావనకు సజీవ రూపం కనిపించడం. కనెక్టికట్‌కు చెందిన అనేక కుటుంబాలు దేశ విదేశాల నుండి విచ్చేసిన అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించి, తమ స్నేహపూర్వకతతో కార్యక్రమానికి ప్రత్యేకమైన కుటుంబ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఒకరికొకరు పరిచయం లేకపోయినా, భారతీయ సంస్కృతి అనే బంధంతో కలిసిపోయిన ఆ ఆత్మీయత ప్రతి అడుగులోనూ కనిపించింది. భరద్వాజ మహర్షి ఆతిథ్య సంప్రదాయాన్ని స్మరింపజేసిన ఈ అనుభూతి, భారతీయత–2026 మహోత్సవానికి మరింత హృద్యమైన ముద్రను చేకూర్చింది.

ఈ వేడుకకు మరో గౌరవకరమైన ఘట్టం న్యూయార్క్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వేదికపై భారతీయత–2026 ప్రదర్శించబడటం. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది దర్శించే ఆ వేదికపై భారతీయ సంస్కృతి, మహర్షుల జ్ఞాన వారసత్వం, సనాతన ధర్మ సందేశం ప్రతిధ్వనించడం, ప్రపంచ వేదికపై భారతీయతకు లభించిన గుర్తింపు. కార్యక్రమం సందర్భంగా సత్సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ తాళ్ళపాక భారతీయత కార్యక్రమం మనల్ని మనం నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకునే, నాగరికతగా మనం సరైన దిశలోనే వెళ్తున్నామా అని ప్రశ్నించుకునే సందర్భం అన్నారు.

7.jpg


సాంకేతికత, విజ్ఞానం, సౌకర్యాల విషయంలో మనం వేగంగా పురోగమిస్తున్నాం. కానీ ఆందోళన, ఒంటరితనం వంటివి తారాస్థాయికి చేరాయి అన్నారు. మహర్షులు మానవజాతి ఎదుర్కొంటున్న పరిస్థితులను ముందుగానే దర్శించి, వాటిని సక్రమంగా ఎదుర్కొనేందుకు అవసరమైన జ్ఞానాన్ని మనకు అందించారని పేర్కొన్నారు. వారు మనిషి పుట్టకముందే, జీవన విధాన జ్ఞానాన్ని మనకు అందించారని, ఆ జ్ఞానం వేల సంవత్సరాలు గడిచినా, ఈ రోజుకీ మనకు మార్గదర్శకంగా ఉందని పేర్కొన్నారు.

రాబోయే ఏడాదిలో ఒక మహర్షి గురించి లోతుగా తెలుసుకోండి, మీకు పుట్టుకతో వచ్చిన ఒక కుటుంబ సంప్రదాయాన్ని ఆచరించండి, ఆ సాంప్రదాయాల గురించి తరువాతి తరంతో ఒక అర్ధవంతమైన సంభాషణ జరపండి” అని చివరగా, సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన ఒక ఆత్మీయ పిలుపునిచ్చారు. భారతీయత అనేది కేవలం ఒక సాంస్కృతిక ఉత్సవం కాదు. అది భారతీయ విలువలతో, మహర్షుల జ్ఞానంతో, సనాతన ధర్మంతో ప్రజల బంధాన్ని పునరుద్ఘాటించే ఒక ఆత్మీయ అనుభవం అని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అతిథులు, కళాకారులు, కుటుంబ సభ్యులు ముక్తకఠంతో ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మహర్షులు వేల సంవత్సరాల క్రితం అందించిన జ్ఞానం కేవలం చరిత్ర పుటలలో మాత్రమే నిలిచిపోలేదు; అది నేటికీ జీవిస్తోంది. ప్రపంచం ఎంత ఆధునికమవుతున్నా, ధర్మం, జ్ఞానం, సేవ, సమైక్యత వంటి విలువలు మానవ సమాజానికి శాశ్వత మార్గదర్శకాలుగానే నిలుస్తున్నాయి. ఈ సత్యాన్ని భారతీయత–2026 మరోసారి గుర్తు చేసిన మహోత్సవంగా నిలిచింది. మహర్షుల జ్ఞాన వారసత్వాన్ని నేటి సమాజానికి అనుసంధానిస్తూ, పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే స్మృతిగా మిగిలింది.

10.jpg4.jpg5.jpg2.jpg1.jpg


ఈ వార్తలనూ చదవండి:

నెదర్లాండ్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

కువైత్‌లో వైభవంగా బాలకృష్ణ జన్మదినోత్సవం

Updated Date - Jun 18 , 2026 | 09:15 AM