ఒమాన్‌లో తెలుగు మహిళకు అనారోగ్యం.. స్థానిక ఎన్నారైల ఆపన్న హస్తం
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:01 PM
పర్యాటక వీసాపై ఒమాన్‌కు వెళ్లి అనారోగ్యం పాలైన ఓ మహిళకు స్థానిక ఎన్నారైలు ఆపన్నహస్తం అందించారు. వైద్య చికిత్స చేయించి స్వదేశానికి పంపించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఉపాధి కోసం అరబ్బు ఎడారిలో అడుగుపెట్టిన వెంటనే అనారోగ్యానికి గురైన ఒక ఆంధ్రా మహిళకు దేశం కానీ దేశంలో కొందరు తెలుగు ప్రవాసీయులు అండగా నిలిచారు. ఆమెకు వైద్య చికిత్స చేయించి, వీసా గడువు ముగియక ముందే బుధవారం రాత్రి స్వదేశానికి పంపించారు.
శ్రీ సత్యసాయిబాబా జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన అబిదా బేగం అనే 48 ఏళ్ళ వితంతువు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఒక ఏజెంటు సహాయంతో సందర్శక వీసాపై ఒమాన్‌కు వచ్చింది. విమానం దిగిన వెంటనే ఆమె అనారోగ్యం క్షీణించడంతో ఆమెను హుటాహుటిన మస్కట్ నగరంలోని ఒక ఆసుపత్రికి తరలించారు.
ఎలాంటి ఉద్యోగ ఒప్పందం, ఉపాధి వీసా లేకుండా కేవలం సందర్శక వీసాపై వచ్చిన ఆమె వైద్య చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె దీనస్థితి గురించి తెలుసుకున్న ఒమాన్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం, హైదరాబాద్ దక్కన్ వింగ్‌ల సభ్యులు అబిదా చికిత్సకు అవసరమైన అయిన ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారు. ఆమె వీసా గడువు ముగియక ముందే స్వదేశానికి వెళ్ళడానికి విమాన టిక్కెట్‌ను కూడా సమకూర్చారు.
తెలుగు రాష్ట్రాల నుండి ఎవరూ కూడా సందర్శక వీసాలపై ఒమాన్‌కు వచ్చి ఇబ్బందులకు గురి కావొద్దని ఒమాన్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ప్రతినిధి గరపాటి సత్య శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. సరైన ఉపాధి వీసా, ఉద్యోగ అగ్రిమెంటుతో మాత్రమే రావాలని సూచించారు.
ఇవీ చదవండి:
అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం
బడ్జెట్ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!