Share News

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి అండగా ఏపీ ఎన్నార్టీఎస్ ప్రతినిధులు

ABN , Publish Date - Aug 25 , 2026 | 04:33 PM

కన్న వారి బంగారు భవిష్యత్తు కోసం ఎడారిబాట పట్టిన తండ్రి అకాల మరణంతో అల్లాడిపోయిన చిన్నారులకు తెలుగు ప్రవాసీ లోకం తోడుగా నిలిచింది.

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి అండగా ఏపీ ఎన్నార్టీఎస్ ప్రతినిధులు
APNRTS

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కన్న వారి బంగారు భవిష్యత్తు కోసం ఎడారిబాట పట్టిన ఓ వ్యక్తి అకాల మరణంతో అల్లాడిపోయిన కుటుంబానికి తెలుగు ప్రవాసీ లోకం అండగా నిలిచింది. భాష, విధివిధానాలు తెలియని పరిస్థితుల్లో తామున్నామంటూ ఆపన్నహస్తం అందించి పెద్దన్న పాత్ర పోషించింది.

అన్నమయ్య జిల్లా రామపురం మండలం గోపగుడిపల్లి గ్రామానికి చెందిన బుసర లక్ష్మీనారాయణ అనే 46 ఏళ్ళ వ్యక్తి చాలా కాలంగా సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. కష్టపడుతూ క్రమంగా స్థిరపడుతున్న అతను ఉన్నత విద్యనభ్యసిస్తున్న తన ఇద్దరు పిల్లల చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆయన ఆరోగ్యం ఒక్కసారి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. ఆసుపత్రిలో మంచంపై ఉన్న తమ పెద్ద దిక్కును కనీసం విడియో కాల్ ద్వారా వీక్షించడానికి అవకాశం లేక స్వదేశంలోని ఆయన కుటుంబం విలవిల్లాడిపోయింది. తెలిసిన తెలుగు వారెవరయినా ఉంటే చెప్పడంటూ కనిపించిన ప్రతి తలుపు తడుతున్న తరుణంలో మంగళగిరిలోని ఏపీఎన్నార్టీఎస్ సంస్థ ఒక ఆశాదీపంగా కనిపించింది.


ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉన్న లక్ష్మీనారాయణను ఏపీ ఎన్నార్టీఎస్ సంస్థ సౌదీ ప్రతినిధులు చెన్నుపాటి రాజశేఖర్, వడ్లమూడి సారథి నాయుడు, జానీ బాషా, ముజ్జమ్మీల్ షేఖ్ పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సకాలంలో స్వదేశంలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. పరాయి దేశంలో కూడా తమ వారున్నారన్న మనోధైర్యాన్ని వారికి ఇచ్చారు. వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ఖరీదయిన గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) చేయడంతో పాటు అత్యున్నతమైన వైద్య సేవలను సౌదీ అరేబియా లక్ష్మీనారాయణకు అందించింది. ఆరోగ్యం క్షీణించడంతో దాదాపు నెల రోజుల చికిత్స అనంతరం ఆయన ఈ నెల 20న మరణించారు.

లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి పంపించడానికి అవసరమైన అన్ని అధికారిక లాంఛనాలను సౌదీ యజమాని సహాయంతో పూర్తి చేసి ఈ మేరకు సోమవారం మృతదేహాన్ని స్వస్థలానికి తరలించామని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏపీ ఎన్నార్టీఎస్ ప్రతినిధి చెన్నుపాటి రాజశేఖర్ తెలిపారు. మృతుడి కుటుంబం, భారతీయ ఎంబసీ ఈ కేసును సమన్వయం చేయడానికి రాజశేఖర్‌కు చట్టబద్ధమైన సమ్మతి తెలిపింది.

ఇదిలా ఉండగా, లక్ష్మీనారాయణ అకాల మరణ విషాదంతాన్ని కొందరు రాద్ధాంతం చేసి రచ్చకీడ్చడం పలువురికి విస్మయం కల్గించింది. కుటుంబ పెద్దను కోల్పోయి మానసిక క్షోభను ఎదుర్కొంటున్న ఆ కుటుంబం వేదనను ఆర్థం చేసుకోకుండా వారి పట్ల రకరకాల ఒత్తిళ్లను తీసుకోవరావడంతో పాటు చివరకు రాజకీయ అరోపణలు చేయడం, పత్రికల్లో ఫొటోలు వేయించి ప్రచారం చేయడం వగైరా దిగ్ర్భాంతి కల్గించాయని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

న్యూయార్క్‌లో పంజాబ్ యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు

Updated Date - Aug 25 , 2026 | 04:45 PM