డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 08:52 PM
అమెరికాలోని డాలస్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 350 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు.
డాలస్, టెక్సస్: అమెరికాలోని డాలస్ నగరంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ నిత్యం యోగా, ధ్యానం ఆచరించేవారని గుర్తు చేశారు. అలాంటి మహానుభావుడి విగ్రహం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, పాల్గొన్న వారందరికీ సాదర స్వాగతం పలికారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2014లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించిందని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇవ్వడంతో ఈ తీర్మానం ఆమోదం పొందిందన్నారు. 2015లో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినప్పటి నుంచి ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యోగా సాధనలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో మహర్షి పతంజలి యోగ సూత్రాలను ప్రపంచానికి పరిచయం చేసి మానవాళికి గొప్ప బహుమతిని అందించారని కొనియాడారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, ‘యోగా’ అనే పదానికి ఐక్యత అనే అర్థం ఉందన్నారు. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని కల్పించే సాధనమే యోగ అని పేర్కొన్నారు. యోగా సాధన చేయడం ద్వారా శరీర సౌలభ్యం, బలం, సరైన భంగిమ, శ్వాస నియంత్రణ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందన్నారు.
నేటి వేగవంతమైన జీవన విధానంలో ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. నిత్యం యోగా చేయడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఆరోగ్యకరమైన కుటుంబాలు, బలమైన సమాజం, శాంతియుత ప్రపంచ నిర్మాణానికి కూడా దోహదపడుతుందని డా. ప్రసాద్ తోటకూర వివరించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ మహేంద్ర రావు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా డాలస్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతుండటం యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
‘హార్ట్ ఫుల్‌నెస్’ సంస్థ సహకారంతో, సురేఖ కోయా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, ధ్యాన శిక్షణ కార్యక్రమం పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గంటన్నర పాటు సాగిన ఈ కార్యక్రమంలో యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనపై శిక్షణ అందించారు.
అనంతరం మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ తైయబ్ కుండావాల మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన అతిథులు, స్వచ్ఛంద సేవకులు, యోగా శిక్షకులు, పాల్గొన్న ప్రవాస భారతీయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ సభ్యులు దీపక్ కల్రా, మురళి వెన్నం, తైయబ్ కుండావాల, కళ కృష్ణమూర్తి, హరీష్ నేహతే, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు లతో సహా అనేక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
Also Read:
తుమ్మల వీరలక్ష్మి ఫిర్యాదుపై విచారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం
టీటీడీ కీలక నిర్ణయం.. ఆలయాల పునరుద్ధరణకు నిధులు విడుదల