Share News

UCSFకు డా.అంబటి శ్రీమన్నారాయణ రూ.10కోట్ల విరాళం

ABN , Publish Date - Oct 04 , 2026 | 02:39 PM

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోకు (UCSF) డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, రమ అంబటి దంపతులు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు) విలువైన ఎండోమెంట్ (శాశ్వత నిధి) విరాళాన్ని ప్రకటించారు.

UCSFకు డా.అంబటి శ్రీమన్నారాయణ రూ.10కోట్ల విరాళం
Dr. Srimannarayana Ambati

అమెరికా(కాలిఫోర్నియా): అంబటి దంపతుల దాతృత్వ స్ఫూర్తి భావితరాలకు మార్గదర్గకం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో డీన్ డాక్టర్ జోస్ ఎమ్ భారల్ సాంచేజ్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోకు (UCSF) డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, రమ అంబటి దంపతులు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు) విలువైన ఎండోమెంట్ (శాశ్వత నిధి) విరాళాన్ని ప్రకటించారు.

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం సాన్ జోవాక్విన్ లోయలో వైద్య విద్య, పరిశోధనలను శాశ్వతంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఇచ్చారు. సాధారణ గ్రాంట్‌లకు భిన్నంగా ఎండోమెంట్‌ నిధులు ఎప్పటికీ అయిపోవు.

US2.jpg


ఈ సందర్భంగా డీన్ డా.సాంచేజ్ మాట్లాడుతూ.. అంబటి దంపతులు ఇచ్చిన ఈ విరాళం ఎండోమెంట్ ఫండ్ కిందకు వస్తుందని అన్నారు. ఎండోమెంట్ నిధి శాశ్వత నిధి కింద జమవుతుందని తెలిపారు. దీనిలో ఉన్న 1 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా ఉంచి, దాని నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే ఖర్చు చేస్తారని అన్నారు. ఏటా ఈ నిధి నుంచి అత్యుత్తమ ప్రతిభ కలిగిన వైద్య విద్యార్థులు, ఇతర విద్యార్థులకు వారి ఆర్థిక అవసరాలకు సహాయం చేయడం జరుగుతుందని వివరించారు. గ్రామీణ వైద్యం, అల్ట్రాసౌండ్ టెక్నాలజీ, కుటుంబ వైద్యం వంటి రంగాల్లో వినూత్న పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. దీనివల్ల భావితరాల వైద్య విద్యార్థుల పరిశోధనలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అంబటి దంపతుల ఈ ఉదారమైన విరాళం UCSF చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అంబటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వైద్యులు, పరిశోధకులు. ఆయన సతీమణి రమ కూడా సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారని సాంచేజ్ తెలిపారు.

US3.jpg


డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ... మాతృభూమి భారతదేశం, తాను స్థిరపడిన అమెరికా రెండింటి రుణం తీర్చుకుంటానన్నారు. 1986 నుంచి అమెరికాలోని UCSFలో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని తెలిపారు. తాము యూఎస్ఏలో 40 ఏళ్లుగా నివసిస్తున్నామని, UCSF తమకు గుర్తింపునిచ్చి తాను వైద్యుడిగా స్థిరపడటానికి అవకాశం కల్పించిందన్నారు. తన సతీమణి రమ ప్రోత్సాహంతో తమ సంపదలో కొంత భాగాన్ని తిరిగి ఈ సమాజానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ నిధి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ప్రతిభ కలిగిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ నిధి భవిష్యత్ తరాలకు కొనసాగుతుందన్నారు. దీనివల్ల ఎంతోమంది వైద్యరంగంలో సేవలందించేందుకు డాక్టర్లు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు తానా - పాఠశాల వేదికగా ఘన నివాళి

అమెరికాలో హిందూ ఆచారాలపై పిల్లలకు 'రిచువల్స్ అండ్ రీజన్' సదస్సులు

Updated Date - Oct 04 , 2026 | 04:56 PM