గురువుగారి కల
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:52 AM
పూర్వం ఒక జెన్ గురువు ఉండేవాడు. అతను తన బోధలను శిష్యులు ఎంతవరకూ గ్రహించారో తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టేవాడు. అందుకోసం తగిన...
జెన్ కథ
పూర్వం ఒక జెన్ గురువు ఉండేవాడు. అతను తన బోధలను శిష్యులు ఎంతవరకూ గ్రహించారో తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టేవాడు. అందుకోసం తగిన సందర్భాలను కల్పించేవాడు. తన శిష్యుల స్పందనను బట్టి వారు సాధనలో, జ్ఞానంలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకొనేవాడు.
ఒక రోజు ఆ గురువుకు నిద్రలో కల వచ్చింది. ఉదయం నిద్ర నుంచి లేవగానే ఆ కలను తలచుకున్నాడు. దాన్ని తన శిష్యులు ఎలా విశ్లేషిస్తారో తెలుసుకోవాలని అనుకున్నాడు. ముందుగా ఒక శిష్యుణ్ణి పిలిచాడు. ‘‘నాయనా! రాత్రి నాకొక కల వచ్చింది. దాన్ని విశ్లేషించి వివరించగలవా?’’ అని అడిగాడు.
అప్పుడు ఆ శిష్యుడు ‘‘గురువుగారూ! ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళాడు. ఒక పాత్రతో నీరు తెచ్చాడు. ‘‘ముందు ఈ నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి’’ అని చెప్పాడు. గురువు తన ముఖాన్ని కడుక్కున్నాడు. శిష్యుడివైపు చూసి నవ్వి ‘‘నీవు నా కలను చాలా బాగా వివరించావు. నా శిష్యుడివని నిరూపించావు’’ అంటూ దీవించి పంపాడు.
ఆ తరువాత మరో శిష్యుణ్ణి పిలిచి ‘‘చూడు నాయనా! రాత్రి నాకు వచ్చిన కలను విశ్లేషించమని అతన్ని అడిగితే... నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ‘‘మీ ముఖం కడుక్కోండి’’ అని చెప్పి పోయాడు. నీవైనా నా కలను విశ్లేషిస్తావా?’’ అని అడిగాడు. ఆ శిష్యుడు ఇంకా చురుకైనవాడు కావడంతో ‘‘గురువుగారూ! రెండు నిమిషాలు వేచి ఉండండి’’ అంటూ బయటకు వెళ్ళాడు. ఒక కప్పునిండా వేడి వేడి తేనీరు తెచ్చాడు. ‘‘అయ్యా! ముందు ఈ తేనీరు సేవించండి’’ అని గురువుగారికి ఇస్తూ... ‘‘కల ముగిసిపోయింది. అది ఏమైతే మనకేమి? మీరు బాగున్నారు. మేము బాగున్నాం. అందరం బాగున్నాం. రాత్రి గడిచిపోయింది. జరిగిపోయిన దాని గురించి చింత ఎందుకు? కల అంటేనే లేనిది అని అర్థం. లేని దాని గురించి వివరణ, విశ్లేషణ ఎందుకు? అదంతా వృధా కాలయాపన. ఈ క్షణంలో జీవిద్దాం. సత్యాన్ని ఎదుర్కొందాం. జీవన రసాన్ని ఆస్వాదిద్దాం’’ అన్నాడు. తన బోధలను శిష్యులు చక్కగా అర్థం చేసుకున్నారని గ్రహించిన గురువు సంతోషించాడు. రోజువారీ కార్యక్రమాలకు ఉపక్రమించాడు.
రాచమడుగు శ్రీనివాసులు
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..