కళలకు వారధిగా..
ABN , Publish Date - May 13 , 2026 | 04:27 AM
సంప్రదాయ కళలకు పూర్వవైభవం రావాలని ఎంతోమంది చెబుతారు. కానీ అందుకోసం కృషి చేసేవాళ్ళు చాలా తక్కువ.కేవలం నినాదాలకే పరిమితం కాకుండా...
సంప్రదాయ కళలకు పూర్వవైభవం రావాలని ఎంతోమంది చెబుతారు. కానీ అందుకోసం కృషి చేసేవాళ్ళు చాలా తక్కువ.కేవలం నినాదాలకే పరిమితం కాకుండా... కళాకారులకు స్థిరమైన ఆదాయాన్ని, గౌరవాన్ని అందించాలనుకున్నారు యోషా గుప్తా.ఆర్థిక నిపుణురాలిగా అంతర్జాతీయ కెరీర్‌ను పక్కనపెట్టి... దేశంలోనే అతి పెద్ద కల్చరల్ టెక్ సంస్థను ఏర్పాటు చేశారు.300కు పైగా కళారూపాలకు, 500మందికి పైగా కళాకారులకు ఒక వేదికను అందించిన యోషా ప్రయాణం ఇది.
‘‘కళలంటే నాకు ఇష్టం కలగడానికి కారణం నా తల్లిదండ్రులు. మా అమ్మకు చిత్రలేఖనం చాలా ఇష్టం. నా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్. నా చిన్నప్పుడు... మా ఇంటి గోడలకు పెయింటింగ్స్ వేయడానికి మధుబని కళాకారులను అమ్మ పిలిపించింది. వారు పని చేస్తున్నంతసేపూ ఆ చుట్టుపక్కలే ఉండేదాన్ని. గోడల మీద స్కెచ్‌లు వేయడం, రంగులు కలపడం, వాటితో కళాకృతులు చిత్రించడం... ఇలా ప్రతిదీ అద్భుతంగా అనిపించింది. అప్పటినుంచి ఆ కళాభిరుచి నాలో శాశ్వతంగా నిలిచిపోయింది. విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా అది కొనసాగింది.
రెండు వర్గాల్ని కలపడానికి...
ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనామిక్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో... సాంస్కృతిక, జానపద కళల వ్యాప్తికి కృషి చేస్తున్న సంస్థల్లో భాగస్వామినయ్యాను. ఎంబియే పూర్తి చేశాక... ‘గేట్స్ ఫౌండేషన్’ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేశాను. ప్రపంచబ్యాంక్‌కు కన్సల్టెంట్‌గా ఉన్నాను. ఆసియా దేశాల్లో, బ్రిటన్‌లో ఆ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించాను. ఆ తరువాత సొంతగా ఒక ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేసి... 500కు పైగా స్టార్ట్‌పలకు నిధులు సమకూర్చాను. స్టార్టప్ అడ్వయిజర్‌గా గుర్తింపు పొందాను. ఫిన్‌టెక్ రంగంలో టాప్-100 మహిళల్లో, హాంకాంగ్‌లో ‘టాప్-50 ఫిన్‌టెక్ ఇన్‌ఫ్లుయన్సర్స్’ జాబితాలో నా పేరు చోటు చేసుకుంది. పలు పురస్కారాలు అందుకున్నాను. మరోవైపు కళలవైపు నా అభిరుచి కూడా పెరుగుతూ వచ్చింది. ఇండియా వచ్చినప్పుడు... నా హ్యాండ్ బ్యాగ్ మీద ‘మధుబని’ చిత్రాన్ని వేయించుకున్నాను. హాంగ్‌కాంగ్‌లో దాన్ని చూసిన మిత్రులు ‘‘నీ బ్యాగ్ చాలా బాగుంది. ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి?’’ అని అడిగారు. వారి ఆసక్తి నన్ను ఆలోచింపజేసింది. అద్భుతమైన కళాకృతుల్ని రూపొందించేవారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. తమకు నచ్చే కళారూపాల్ని కొనడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు వర్గాలనూ కలిపే వారధి కావాలి.. అలాంటి వేదికను నేనే ఏర్పాటు చేయాలనుకున్నాను. 2029లో ‘మిమిరాకీ’ అనే సంస్థను స్థాపించాను.

విమానాశ్రయాల్లో కూడా...
ఈ రోజున... మిమిరాకీ సంప్రదాయ, జానప కళారూపాలకు ఒక సమగ్రమైన ప్లాట్‌ఫారమ్‌గా ఎదిగింది. 300కు పైగా కళారూపాలకు చెందిన దాదాపు 500 మంది నిపుణులైన కళాకారులు దీనికి అనుబంధంగా ఉన్నారు. పదివేలకు పైగా కళాకృతులు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు... హైదరాబాద్ విమానాశ్రయంలో కళాకృతుల్ని చిత్రించే అవకాశం మాకు లభించింది. ఆ తరువాత మరో రెండు విమానాశ్రయాల్లో కళకృతుల ఏర్పాటును చేపట్టాం. ఇప్పుడు పలు కార్పొరేట్ సంస్థలు కూడా మాకు క్లయింట్లుగా ఉన్నారు. విక్రయాలద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువశాతం కళాకారులకే అందిస్తున్నాం. మిగిలిన మొత్తంలో కొంత భాగాన్ని కళల పరిరక్షణకు ఖర్చు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత విస్తరించి... మా సంస్థ ద్వారా కళాకారుల జీవితాలపై అర్థవంతమైన ప్రభావం చూపించాలి. వారి ప్రతిభ ప్రపంచమంతటా గుర్తింపు పొందేలా చేయాలి. ఇదే నా ఆకాంక్ష.’’
200కు పైగా వర్క్‌షాపులు...
రకరకాల డిజైన్లను చిత్రించిన హ్యాండ్‌బ్యాగ్‌లను ప్రత్యేకంగా తయారుచేయించి, దేశ, విదేశాల్లోని కస్టమర్లకు విక్రయించడంతో మా సంస్థ ప్రయాణం మొదలైంది. ఇంతలో కొవిడ్ రావడంతో... మార్కెట్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈలోగా నేను వివిధ హస్తకళాకారుల వివరాలతో ఒక జాబితా తయారు చేసుకున్నాను. వారి సహకారంతో ఆన్‌లైన్ ఆర్ట్ వర్క్‌షాపుల్ని నేను, మరికొందరు నిపుణులు నిర్వహించాం. వీడియాలో ద్వారా మెళకువలను వివరించాం. ఇలా దాదాపు 200 పైగా వర్క్ షాపుల్ని నిర్వహించాం. అలాగే కళాకారులు తయారు చేసినవాటిని తొలిసారిగా అమ్మకానికి పెట్టినప్పుడు... రూ. పది లక్షలకు పైగా విక్రయాలు జరిగాయి. దాంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత