శరణాగతి అంటే...
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:01 AM
కొన్ని నెలల క్రితం. ఒక మధ్య వయసు పేషెంట్ కార్డియాలజీ కన్సల్టేషన్ గదిలో నా ముందు కూర్చొని ఉన్నారు. అతని రిపోర్టుల్లో మెరుగుదల కనిపించింది, అతనికి ఇచ్చిన మందులు పని చేస్తున్నాయి, అయినప్పటికీ...
యోగా
కొన్ని నెలల క్రితం. ఒక మధ్య వయసు పేషెంట్ కార్డియాలజీ కన్సల్టేషన్ గదిలో నా ముందు కూర్చొని ఉన్నారు. అతని రిపోర్టుల్లో మెరుగుదల కనిపించింది, అతనికి ఇచ్చిన మందులు పని చేస్తున్నాయి, అయినప్పటికీ అతను అశాంతిగా కనిపిస్తున్నారు. ‘‘డాక్టర్! మీరు చెప్పిన ప్రతిదీ చేస్తున్నాను. కానీ ఇప్పటికీ ఆందోళనగా ఉంది. ఏదైనా మళ్ళీ జరిగితే పరిస్థితి ఏమిటి?’’ అని అడిగారు. ఆయన ప్రశ్న కేవలం గుండెకు సంబంధించినది కాదు. నియంత్రణకు సంబంధించినది.
కర్మణ్యే వాధికారస్తే...
ఆధునిక వైద్యులుగా ప్రమేయం, సరిదిద్దడం, స్థిరీకరించడంలో మేము శిక్షణ పొందాం. కార్డియాలజిస్టులుగా, మేం కచ్చితత్వంతో పని చేస్తాం. కానీ వైద్యం తన పరిమితులను చేరే దశ ఒకటి వస్తుంది, జీవితం ఒక పెద్ద ఇంటలిజెన్స్ కింద కొనసాగుతోంది... అది శరీరానికి చెందిన సొంత స్వస్థత వ్యవస్థ. గుండె సమస్యల్లో చాలావరకూ తీవ్రమైన ఒత్తిడి వల్ల అధ్వాన్నంగా మారుతాయి. నిరంతర భయం, ఎక్కువగా ఆలోచించడం లాంటివి నాడీ వ్యవస్థను అప్రమత్తమైన ఒక స్థితిలో ఉంచుతాయి. ఒత్తిడి హార్మోన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి, నిద్ర చెదిరిపోతుంది, గుండె దాని స్వాభావికమైన సానుకూల లయను కోల్పోతుంది. శరీరం కేవలం వ్యాధి వల్ల కాకుండా, నిరోధకత వల్ల ఇబ్బంది పడుతుంది. ఇక్కడే ‘శరణాగతి’ అనే సూత్రం శక్తిమంతంగా మారుతుంది. శరణాగతి అంటే వదులుకోవడం కాదు, ఫలితాల పట్ల అధికంగా ఉన్న అనుబంధాన్ని విడిచిపెట్టడం. దీన్నే ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అని భగవద్గీత మనకు గుర్తు చేస్తోంది. అంటే ‘మనకు కర్మల మీద తప్ప కర్మ ఫలాల మీద నియంత్రణ ఉండదు’ అని అర్థం.
సర్వ ధర్మాన్ పరిత్యజ్య...
వైద్యులుగా మనం సమర్థతతో వ్యవహరించాలి. రోగులుగా మనం క్రమశిక్షణ పాటించాలి. నిరంతరమైన ఆందోళన ఫలితాలను మెరుగుపరచదు, అది చేసేది వ్యవస్థను కలవరపెట్టడం మాత్రమే. దీన్ని మేము ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానంలో సున్నితంగా అభ్యసిస్తాం. మేము కూర్చుంటాం, హృదయం మీద ధ్యాస ఉంచుతాం, అంతర్గత శుద్ధీకరణ సహజంగా జరగడానికి వీలు కలిగిస్తాం. మనం పురోగతిని కొలవడం మానేసి, అంతర్గతమైన ఒత్తిడిని సడలించినప్పుడు, ప్రశాంతత గాఢమవుతుంది. మన అంతశ్చేతన ఆదేశం లేకుండా భౌతికమైన గుండె కొట్టుకుంటున్న విధంగానే... ప్రతిఘటన తగ్గినప్పుడు ఆధ్యాత్మికమైన ఎదుగుదల సంభవిస్తుంది. భగవద్గీత ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అని కూడా హామీ ఇస్తోంది - ఉన్నతమైన సూత్రానికి శరణాగతులు కావాలంటోంది. ఇది బలహీనత కాదు, విశ్వాసం.
శాంతి నుంచి విశ్వాసం
‘‘మీ వంతు పని నిజాయితీగా చేయండి. మీ మందులు తీసుకోండి. క్రమం తప్పకుండా నడవండి. ఆలోచనాత్మకంగా తినండి. తరువాత, జీవితాన్ని ప్రవహించనివ్వండి’’ అని నా రోగులకు తరచుగా చెబుతూ ఉంటాను. గట్టిపడిన ధమని రక్తపోటును పెంచుతుంది. అనువుగా ఉండే నాళం అడాప్ట్ చేసుకోగలదు. అలాగే కరడుగట్టిన అహంకారం బాధను పెంచుతుంది, వశ్యత కలిగిన మనస్సు వేగంగా స్వస్థత పొందుతుంది. ‘శరణాగతి’ అంటే భావోద్వేగపరమైన పరిపక్వత. మనం బాధ్యతగా వ్యవహరించడానికి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోడానికి ఇది వీలు కలిగిస్తుంది. ప్రయత్నం అవసరమే, కానీ శాంతి అనేది విశ్వాసం నుంచి వస్తుంది.... వైద్యంలో, ధ్యానంలో నేను నేర్చుకున్న పాఠం ఇదే. ప్రయత్నం, శరణాగతి కలిసి ఉన్నప్పుడు... హృదయం భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ సహజమైన తన లయను కనుగొంటుంది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం